Date of Publish : 05 February 2021, 12:29 pm
Editor : Sake Naresh
ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి జనసేన కృషి – నాదెండ్ల మనోహర్ గారు…

విశాఖ ఉక్కు కర్మాగారం... తెలుగువారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక. ఇటువంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బాధాకరమేనని జనసేన భావిస్తోంది. 22 వేల ఎకరాల్లో విస్తరించి 17 వేల మంది పర్మినెంట్, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు సుమారు లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్న ఈ ప్లాంటు ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడం అనేది జనసేన అభీష్టానికి వ్యతిరేకం.ఒకసారి ఈ కర్మాగారం చరిత్ర పుటలను తిరగేస్తే ఈ కర్మాగారం ఆవిర్భావం కోసం 32 మంది ప్రాణాలను వదిలారు. వందలాది మంది నిర్భందాలకు గురయ్యారు. లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇంతటి త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ఈ కర్మాగారం చేతులు మారుతుందంటే తెలుగువారందరికీ ఆమోదయోగ్యం కాని విషయమే. యు.పి.ఎ పక్షాన ప్రధాన మంత్రిగా ఉన్న కాంగ్రెస్ కు చెందిన శ్రీ మన్మోహన్ సింగ్ గారు ముందుకు తీసుకెళ్లిన పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఆ పరిధిలోకి చేరిన ఉక్కు కర్మాగారాన్ని ఇప్పటి పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి జనసేన పార్టీ తనవంతు కృషి చేస్తుంది. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసిందిగా గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు, బి.జె.పి. జాతీయ అధ్యక్షులు శ్రీ నడ్డా గారిని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరనున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రత్యక్షంగా ఈ విజ్ఞాపనను తెలుగువారి పక్షాన ఆయన తెలియచేస్తారు అని నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు.
All Rights Reserved By Janaswaram News.