"అన్నం పరబ్రహ్మ స్వరూపం" అంటారు. వ్యవసాయం చేస్తూ ఎంతో కృషి, శ్రమ దానం చేస్తే తప్ప మన నోటికి ఆహారం అందదు, పంటలను పండించే రైతు ఎంతో కష్టపడితే, కంటి రెప్ప వాల్చకుండా కాపాడుకుంటే, లాభం నష్టం ఆలోచించకుండా పెట్టుబడి పెట్టుకొని పూర్తి సమయాన్ని కేటాయిస్తే తప్ప పంట చేతికి రాదు. ఒక్కోరకం ఆహార ధాన్యాలను వివిధ రకాలలో పండించినా కష్టం రైతుదే. స్వంత భూములలో సేద్యం చేసే వాళ్ళు కొందరు, భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేది కొందరు. మానవ మనుగడకు ఆధారం వ్యవసాయ రంగం. అత్యంత ముఖ్యమైన వ్యవసాయ రంగం అభివృద్ధిని బట్టే ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉంటుంది. సారవంతమైన భూములు, సాగుబడిలో అపార అనుభవం ఉండి, ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా వ్యవసాయాన్ని నమ్ముకొని అనుక్షణం శ్రమించే రైతులు ఉండబట్టే జీవనాధారమైన ఆహారం అందుకోగలుగుతున్నాం. అన్న దాతలు ఈ ఇబ్బందులు నాకెందుకు అని ఎదుర్కోలేక, భారం భరించలేక, శక్తి చాలదని ఏడాది పాటు అలిగితే మన గతి అధోగతే. అన్నదాతలు అలుపెరుగని శ్రమజీవులుగా నిరంతరం యుద్ధం చేస్తూ మనకు ఆహారాన్ని అందిస్తుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మాత్రం రైతులను చిన్న చూపు చూస్తున్నాయి, నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు రైతాంగానికి ఉపయోగపడట్లేదు, సంక్షోభం వైపు దారి తీస్తున్న వ్యవసాయ రంగాన్ని ఆర్ధికంగా ఆదుకుంటే స్వంతంగా పోషించుకునే అవకాశాలను కోల్పోకుండా ఆలోచన చేసి, సరైన వ్యూహాలను పాలకులు చేపట్టటం లేదు. అమలు చేయుటకు ప్రయత్నించటం లేదు, విత్తనాల కొనుగోలు మొదలు, పంటలను మార్కెట్ చేర్చే వరకూ ప్రతి అడుగులో రైతులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వ పాలకులకు ఉంది కానీ అటువంటి చర్యలు ఏవీ ఉండవు. కష్టం చేసేది రైతు, లాభ నష్టాల బాధ్యత కూడా రైతుకే. ఇన్ని దాటుకుని ముందుకు వెళుతుంటే ప్రకృతి కన్నెర్ర చేస్తే తట్టుకోవాలి. ప్రకృతి విపత్తుల ద్వారా జరిగే విధ్వంసం చూస్తూ ప్రేక్షక పాత్ర వహించాలి. వ్యవసాయ రంగానికి అతి పెద్ద వరం ప్రకృతే, శాపం కూడా ప్రకృతి వల్లే. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రణాళికా బద్ధంగా ఎదుర్కొని నష్టాలను తగ్గించే దారులను వెతికి శాశ్వతమైన పథకాలను రూపొందించడంలో ప్రభుత్వాలు వెనుకబడి ఉన్నాయి.
లక్షల కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం బడ్జెట్ లో కేటాయింపులు జరిగినా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన మన రాష్ట్రంలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. వారిలో అధిక శాతం మంది కౌలు రైతులే.
2019లో వైసీపీ ప్రభుత్వం, LEC చట్టాన్ని రద్దు చేసి కొత్తగా ‘పంట సాగుదారు హక్కు చట్టం’ (Crop Cultivator Rights Card) అనే కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ప్రకారం భూమి స్వంతదారుడికి, కౌలుదారుడికి మధ్య 11 నెలల ఒప్పందం ఉండాలి. అప్పుడే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వర్తిస్తాయని, భూమి స్వంత దారుడు రెవెన్యూ అధికారుల సమక్షంలో సంతకం చేస్తేనే CCRC గుర్తింపు కార్డు ఇస్తామని షరతు పెట్టటం “కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక పోయింది” అన్నట్లు అయ్యింది. మన రాష్ట్రంలో సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలతో ప్రాణాలు తీసుకుంటుంటే. వారిలో అధిక శాతం మంది కౌలు రైతులే. తమకు స్వంతం కాని భూముల్లో వ్యవసాయం చేస్తూ, ఆర్ధిక పరమైన, వ్యవస్థాపరమైన ఇబ్బందులను సహిస్తూ, నష్టం వచ్చినా భరిస్తూ, బ్రతుకు బండిని లాగలేక, ఆర్ధిక భారం మోయలేక అప్పుల పాలై బాధను దిగమింగలేక జీవితాన్ని అర్ధాంతరంగా అంతం చేసుకుంటున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి సాగు నష్టం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడి మరణించిన 3000 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందించాలన్న సదుద్దేశంతో “జనసేన రైతు భరోసా యాత్ర” కార్యక్రమం చేపట్టి 5 విడతలుగా అనంతపురం, ప్రకాశం, కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోఆర్ధిక సహాయం అందించారు. నేడు గుంటూరు జిల్లాలో 6 విడత కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com