అమరావతి, (జనస్వరం) : 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని, రాని ప్రభుత్వం కోసం అధికారులు తపన పడొద్దని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. వైసీపీ సృష్టించిన ఆరాచకాలు, విధ్వంసానికి ప్రజలను ఓటు అడిగే హక్కు కోల్పోయిందని అన్నారు. ప్రజలను పల్లకీ ఎక్కించడానికి.. వారిని పల్లకీలో కూర్చోబెట్టడానికి జనసేన పార్టీ కృషి చేస్తుంది తప్ప ఎవరి పల్లకీలు మోయడానికి సిద్ధంగా లేదని అన్నారు. అనంతపురంలో ఈ నెల 12వ తేదీ నుంచి కౌలు రైతు కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. మంగళవారం రాత్రి మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “చాలా మంది మేధావులు మీరు పార్టీ ఏలా నడుపుతారని అడుగుతున్నారు. మనకన్నా ముందు కాన్షీరాం గారి స్ఫూర్తితో చాలా పార్టీలు వచ్చాయి కానీ నిలబడలేకపోయారు. ఒక పార్టీ నిలబడాలి అంటే ఒత్తిళ్లను తట్టుకునే మానసిక స్థైర్యంతోపాటు అందరినీ ఏకం చేసే భావజాలం కావాలి. 8 ఏళ్లుగా పార్టీని నడపడం అంటే సామాన్య విషయం కాదు. మనస్ఫూర్తిగా మనల్ని మనం అభినందించుకోవాలి. ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
● చుక్క కన్నీరు తుడవ గలిగితే చాలు
మనం ఈ రోజు ఒక ముద్ద తినగలుతున్నాం అంటే దానికి కారణం కౌలు రైతే. అలాంటి కౌలు రైతులు వేలల్లో ఆత్మహత్యలు చేసుకోవడం బాధకలిగింది. కౌలు రైతుల సమస్య జనసేన సృష్టించింది కాదు. వాళ్ల ఆత్మహత్యలకు కారకులు వైసీపీ నాయకులే. కర్నూలు జిల్లాలో 353 మంది, అనంతపురంలో 178మంది, ఉభయ గోదావరి జిల్లాల్లో 81 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందరూ కూడా వివిధ కులాలు, మతాలకు చెందిన వారు. 40 నుంచి 45 ఏళ్ల వయసు మధ్యవారు. అన్నం పెట్టే రైతులకు కులం లేదు. అలాంటి రైతులను కులంతో విభజించింది వైసీపీ పార్టీ. దగా పడ్డ రైతుకు అండగా నిలబడాలి. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతులు వేలల్లో ఉన్నారు. వారందరి కుటుంబాలను ఆదుకోవడానికి అంత డబ్బు ఎక్కడ నుంచి తెస్తామని చాలా మంది అడుగుతున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది. మనసును కదిలించ గలిగితే డబ్బులు అవే వస్తాయి. నేను పాటించనిదే ఎవరీని ఏమీ అడగను. కష్టాల్లో ఉన్న వారికి మన వంతు సాయం చేయాలనే రూ. 5 కోట్లు ఇచ్చాను. మనం ఇచ్చే లక్ష రూపాయలతో కౌలు రైతుల కుటుంబాల్లో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పను. వాళ్ల ఒక్క కన్నీరు చుక్కను తుడవగలిగితే మా జీవితం ధన్యమైనట్లేనని నమ్మతాను. దేశం కోసం సమాజం కోసం చాలా మంది మహానుభావులు వారి ఆస్తులను విరాళంగా ఇచ్చేశారు. నాకు వాళ్లంత పెద్ద హృదయం లేకపోవచ్చు కానీ నా స్థాయిలో నేను చేస్తాను. ప్రకృతి విపత్తు నుంచి మొదలు కల్తీ విత్తు వరకు ముందు నష్టపోయేది రైతే. జనసేన చేపట్టిన రైతు భరోసా యాత్ర ఒక ఉద్యమంలా ముందుకు వెళ్లాలి. ఈ నెల 12న అనంతపురంలో మొదలుపెడతాం. కనీసం ఆ రోజు 30 మంది ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందిస్తాం.
● రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారు
వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని మార్చి 14న మాట్లాడటం వెనుక చాలా ఆలోచించే మాట్లాడాను. పాలనలో వైఫల్యం, ఆరాచకం, దోపిడి వల్ల రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారు. ఇవన్ని దృష్టిలో పెట్టుకొనే ఆ రోజు ఆ మాట అన్నాను. 'వైసీపీ నాయకులు జనసైనికులారా మోసపోకండి.. వారి పల్లకీలు వీళ్ల పల్లకీలు మోయడానికి సిద్ధం కండి' అంటున్నారు. జనసేన ఉన్నది ప్రజల పల్లకీలను మోయడానికి తప్ప ఎవరీ పల్లకీలను మోయడానికి కాదు. జనసైనికులకు నేనేంటో తెలుసు. వాళ్లపై మీకు నిజంగా ప్రేమ ఉంటే 14వ తేదీన సభకు వచ్చే వారిపై కేసులు ఎందుకు పెట్టారు? వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చం అనే ఏకవాక్య తీర్మానానికి ఎందుకు అంత భయం? మీరు నిజంగా ప్రజలకు మేలు చేసే పాలనే అందిస్తే భయపడాల్సిన అవసరం ఏముంది? మద్యపాన నిషేధం అని ఓట్లు వేయించుకొని ఇప్పుడు ప్రత్యేక రేట్లతో అమ్ముతున్నారు. రేట్లు పెంచితే తాగుడు మానేస్తారని తప్పుడు లాజిక్ మాట్లాడుతున్నారు. విద్యుత్ ఛార్జీలపై బాదుడే బాదుడు అనే మాట మేము సృష్టించింది కాదు. 2018లో వైసీపీ నాయకత్వం ఉపయోగించిన మాటే. ఆస్తి పన్ను పెంచేస్తారు. చెత్తపన్ను విధిస్తారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వరు. 100 మంది దగ్గర ట్యాక్సులు వసూలు చేసి 30 మందికి సంక్షేమ పథకాలు అందిస్తే మిగతా 70 మంది ఏమవ్వాలి? 32 మంది బలిదానాలు చేస్తే స్టీల్ ప్లాంటు ఏర్పడింది. పార్లమెంటులో ఇంత మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కరు కూడా కర్మాగారానికి సొంత గనులు ఇవ్వండి అని అడగలేకపోయారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జనసేన పార్టీ వ్యతిరేకిస్తోంది. కార్మికుల పక్షాన నిలబడుతుంది. ఇదే విషయాన్ని కేంద్రానికి గౌరవ స్ఫూర్తిగా తెలియజేస్తాం. ప్రైవేటీకరణపై కేంద్రం మనసు మార్చుకుంటుందని నమ్మకముంది. సొంత గనులు ఇస్తుందని నమ్ముతున్నాను. ఒకవేళ ప్రైవేటీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం దానినెలా కాపాడుకోవాలో అందరితో కూర్చొని ఆలోచన చేసి ప్రణాళికతో ముందుకెళ్తాం. బలమైన పాలన వ్యవస్థ ఉంటే క్రైమ్ చేసే వాడు భయపడతాడు. అలాంటి పాలన లోపించింది. శాంతిభద్రతల విషయంలో మనం 6వ స్థానంలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నేరాలను ఆరికట్టే బలమైన పోలీసింగ్ వ్యవస్థ రావాలి. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతాము. పొత్తులో ఉన్నామని ఒక మాట చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. నాపై ఉన్న కేసులు తీసేయండి అని అడగటం లేదు కదా? అలాంటి పరిస్థితులు ఉంటే రాజకీయాల్లోకి వచ్చే వాడినే కాదు. పొత్తులో ఉన్న రెండు పార్టీలు 70 శాతం ఏకాభిప్రాయం ఉంటే చాలు. అన్నింటినీ ఏకీభవించాల్సిన అవసరం లేదు.
● ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెడతాం
ఉత్తరాంధ్ర జనసేనకు బలమైన జిల్లాలు. పోరాటయాత్ర సమయంలో రాజాంలో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. విజయనగరంలో ఏకంగా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అలాగే నిలబడ్డారు. ఎంతో మంది యువత, ఆడపడుచులు మన వెనక ఉన్నారు. అయితే వాళ్లను నడిపించే నాయకత్వం లేదు. నాయకత్వం ఒక్క రోజులో పెరగదు. క్రమంగా పెంచుకుందాం. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెడతాను. రీజనల్ కార్యాలయం ఏర్పాటు చేస్తాం. అక్కడ యువతలో ధైర్యం నింపేందుకు నేనే వచ్చి కూర్చుంటా. అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు. ఉద్యోగాలు ఉపాధి లభించకపోవడంతో యువత అడ్డదారులు తొక్కుతోంది. గంజాయి సాగు వైపు వెళ్లిపోతుంది. దానిని అరికట్టాలి. రాష్ట్రానికి అమరావతే రాజధాని. విశాఖను విశ్వనగరంగా తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలి. కర్నూలులో ఒక్క కోర్టు బిల్డింగ్ పెడితే అభివృద్ధి జరగదు. క్రమంగా అభివృద్ధి చేయాలి. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు దారులకు ఇసుకను ఉచితంగా అందిస్తాం. స్వయం ఉపాధితో పాటు నలుగురికి ఉద్యోగాలు సృష్టించుకునే యువతను ఎంపిక చేసి ఏడాదికి లక్షమందికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తాం. వ్యవసాయం, ధరల స్థిరీకరణకు రూ. 5వేల కోట్లు నిధిని ఏర్పాట్లు చేస్తాం. వైసీపీ చేసిన అప్పులు తీర్చి రాష్ట్రాన్ని అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ గా మార్చడంతో పాటు అభివృద్ధి పథంలో నడిపేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com