
అమరావతి, (జనస్వరం) : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 8వ తేదీన జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధులందరూ బలమైన పోరాటం చేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల మేరకు 179 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలను జనసేన అభ్యర్ధులు గెలుచుకున్నట్టు తెలుస్తోందన్నారు. పార్టీ తరఫున విజయం సాధించిన అభ్యర్ధులందరికీ జనసేన తరఫున, జనసైనికుల తరఫున, నాయకులందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయి, ఏ నేపధ్యంలో జరిగాయి అన్న అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. మరింత సమాచారం రావాల్సి ఉందన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ఫలితాలపై రెండు మూడు రోజుల్లో సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తానని తెలిపారు.