నెల్లూరు సిటీ , (జనస్వరం ) : జనసేన పార్టీ నెల్లూరు సిటీ కార్యాలయంలో నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి చెత్త పన్నుల అంశంపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఇంటిలో నుండి చెత్తను తీసుకుని వెళ్లేందుకు పన్నులు వేసిన ఘనత ఈ ప్రభుత్వానికి, సీఎం జగన్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు. దేశంలో GST అమలవుతుంటే రాష్ట్రంలో GSTకి తోడు JST అమలవుతుందన్నారు. JST అంటే జగన్ శానిటరీ ట్యాక్స్ గా అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా చెత్త కుండీలకు బులుగు రంగు, పచ్చ రంగు ఎందుకుంటుందో తమకు ఇప్పటివరకు తెలియదని కానీ ఇప్పుడు బులుగు రంగు, పచ్చ రంగులతో రాష్ట్రంలో రాజకీయం చేసే వైసీపీ ప్రభుత్వానికి ఆ రంగుల్లో ఉండే చెత్త కుండీలే ప్రధాన ఆదాయ వనరుగా మారాయని ఎద్దేవా చేసారు. వాలంటీర్లకు ఇచ్చే 5వేల రూపాయల జీతభత్యం కంటే ఆ 50 ఇళ్ళకు చెత్త నుండి వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉందని, దీన్ని బట్టే ప్రభుత్వం నిధుల సమీకరణకు ఎలాంటి పద్ధతులు అవలంభిస్తుందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రజా జీవనాన్ని ఏమాత్రం మెరుగుపర్చలేని పథకాలకు డబ్బులు సమకూర్చడం కోసం రాష్ట్రాన్ని కేంద్రం దగ్గర, బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టేసి ఉన్నారని, ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఇలాంటి చెత్త పన్ను మార్గాలను సృష్టించిందని దుయ్యబట్టారు. ప్రజల నుండి ఏటా వసూలు చేసే ఇంటి పన్ను, కుళాయి పన్నులోనే ఆ ఇంటికి ప్రభుత్వం అందించే చెత్త, డ్రైనేజి, వీధి లైట్లు, రోడ్లు, కాలువలు, కుళాయిలకు సంబంధించిన మెయింటనెన్స్ ఉంటుందని మరప్పుడు చెత్త పన్ను ఏమిటని ప్రశ్నించారు. అంటే ఏటా ఇంటి పన్నులు కట్టేది ఎవరి ఇంట్లో వారు జీవించడానికా అని ప్రశ్నించారు. ఇప్పుడు నెలనెలా కరెంట్ బిల్లుల మాదిరి చెత్త బిల్లులు తయారయ్యాయని, ప్రజలు ఇప్పటికి కూడా మేల్కొని తిరగబడకపోతే త్వరలో డ్రైనేజి పన్ను, నీటి పన్ను, వీధి లైట్ పన్ను, రోడ్డు పన్ను, కాలువ పన్ను, ఆఖరికి పీల్చే గాలి పన్ను, సూర్యుడు నుండి వచ్చే వెలుగుకు కూడా పన్ను వసూలు చేస్తారని ఎద్దేవా చేసారు. నెల్లూరు నగరంలో సరైన చెత్త కుండీలు లేక పారిశుద్ధ్యం అస్తవ్యస్తం అయిన విధానం గురించి కొత్త చెత్త కుండీలు, చెత్త వాహనాలు సమకూర్చాలని ఇప్పటికే జనసేన పార్టీ తరఫున వివిధ దశల్లో పోరాటం చేశామని కానీ ప్రభుత్వంలో ఆ దిశగా చర్యలు లేవని దుయ్యబట్టారు. నగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని అదే సమయంలో ఇప్పుడు చెత్త పన్నులు వేస్తున్నారని, ప్రజలెవరూ చెత్త పన్ను కట్టకండని, ఈ పన్నులు రద్దయ్యే వరకు జనసేన పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఒకవేళ ఈ ప్రభుత్వం ఈ అడ్డగోలు పన్నులను రద్దు చేయకుంటే త్వరలో ఏర్పడబోయే జనసేన పార్టీ ప్రభుత్వంలో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పన్నులను రద్దు చేస్తారని కేతంరెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పావుజెన్నీ చంద్ర శేఖర్ రెడ్డి, కుక్క ప్రభాకర్, శ్రీకాంత్ యాదవ్, శ్రీను ముదిరాజ్, జీవన్, ఈశ్వర్, హేమంత్ రాయల్ రాజా జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.