నేడు నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల విప్లవం అంటూ ఇచ్చిన జాబ్ క్యాలెండర్, పత్రికా ప్రకటనల పై కేతంరెడ్డి తనదైన శైలిలో విమర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల విడుదలైన జాతిరత్నాలు అనే కామెడీ సినిమాలో హీరోని తన స్నేహితులు తమని పైకి తీసుకొచ్చేదానికి ఏమి చేసావురా అని అడిగితే 2008 వ సంవత్సరంలో జల్సా సినిమా విడుదల రోజున సినిమా హాళ్ళో 10 రూపాయల టికెట్లో ఉన్న మిమ్మల్ని బాల్కనీలోకి తీసుకొచ్చా కదరా, మిమ్మల్ని పైకి తీసుకొచ్చా కదరా అని డైలాగ్ చెప్తాడన్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ జాతిరత్నం జగనన్న పరిస్థితి కూడా ఈ జాతిరత్నాలు సినిమాలో చూపిన విధంగానే ఉందని ఎద్దేవా చేసారు. ఏమీ లేని వారికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి పైకి తెచ్చాము అని, వాటిని ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ పత్రికల్లో ప్రకటనలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. పత్రికల్లో ప్రకటించిన ఆరు లక్షల పైచిలుకు ఉద్యోగాల్లో కేవలం పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే ఈ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ కి అనుగుణంగా ఏర్పడినవి అని అన్నారు. ఒక లక్షా ఇరవై ఒక్క వేలు పైన ఉన్న సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పీఆర్సీ అమలైతేనే వారు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడుతారు తప్పించి అప్పటివరకు వారిని పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించలేమన్నారు. ప్రభుత్వం వారికి పీఆర్సీ అమలు చేసి స్కేల్ వర్తింపజేసే విధంగా అడుగులు వేయాలని డిమాండ్ చేసారు. ఇక ప్రభుత్వంలో విలీనం అయిన ఆర్టీసీ ఉద్యోగులను కూడా ఈ ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రకటనలో చూపడం హాస్యాస్పదమన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ లలో ఏళ్ళ తరపడి పనిచేస్తున్న వారిని ఆప్కాస్ అని ఒకటి సృష్టించి వారికేదో ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపడం కూడా నిరుద్యోగులను మభ్య పెట్టే చర్య అని పేర్కొన్నారు. ఇక ఈ సంవత్సరం చేపట్టబోయే జాబ్ క్యాలెండర్ కూడా నిరుద్యోగుల ఆశల పై నీళ్ళు చల్లే విధంగా ఉందని కేతంరెడ్డి మండిపడ్డారు. పది లక్షలకు పైగా నిరుద్యోగులు వేచిచూస్తున్న గ్రూప్స్ లో కేవలం 36 పోస్టులు చూపడం చూస్తుంటే ఈ కేటగిరి ఉద్యోగాలు సీఎం జగన్ దగ్గర పని చేసే వారికే దక్కే అవకాశం ఉందన్నారు. మెగా డీఎస్సీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కళ్ళల్లో కారం పడినట్లు అయిందన్నారు. యూనివర్సిటీలలో రెండు వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అంటున్నారు కానీ ఇప్పటికే అనేక ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారి ఉద్యోగ భద్రత, టైమ్ స్కేల్ పై నిర్ణయాలు లేవన్నారు. అంటే ఈ పోస్టుల భర్తీ కోర్టుల వద్ద ఆగిపోతుంది తప్పించి ముందుకెళ్లే పరిస్థితి లేదన్నారు. ఇక ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ RPS 2015 ప్రకారం ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2015 నుండి ఇప్పటికీ ధరల్లో తీవ్ర పెరుగుదల ఉందని, నూతన పీఆర్సీ సిఫార్సులు, సూచనల ప్రకారం ఇప్పుడు మినిమం టైమ్ స్కేల్ ఉండాలి కాని పాత సిఫార్సుల ఆధారంగా కాంట్రాక్టు ఉద్యోగులకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నారు. అసలు కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ఇస్తూ జారీ చేసిన జీవో లోనే అనేక లోపాలున్నాయని, ఇదంతా కేవలం వారిని మభ్యపెట్టడానికి ఈ ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడ తప్పించి మరొకటి కాదని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల విషయంలో జాతిరత్నం వేషాలు మానాలని ఎద్దేవా చేసారు. తమ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే నిరుద్యోగులకు కాని, కాంట్రాక్టు ఉద్యోగులకు కాని నిజమైన న్యాయం జరుగుతుందని, ఆ రోజులు ఎంతో దూరంలో లేవని కేతంరెడ్డి వినోద్ రెడ్డి పునరుద్ఘటించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com