కడప రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన జనసేన నాయకులు
కడప నగరంలోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండు రోజులుగా సౌకర్యాల లేమి కారణంగా ఇద్దరు పౌరులు మృతి చెందడం జరిగింది. ఈ దుర్ఘటన పై స్పందించిన జనసేన పార్టీ నాయకత్వం జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంటరీ కమిటీ కో కన్వీనర్ శ్రీ సుంకర శ్రీనివాస్ గారి నేతృత్వంలో కడప నగర అధ్యక్షులు మాలే శివ గారి ఆధ్వర్యంలోని బృందం పరిశీలన కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అనారోగ్యంతో బాధపడుతూ వైద్య సహాయం కోసం రిమ్స్ ఆసుపత్రికి కి చేరుకున్నటువంటి రోగులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రిమ్స్ ఆసుపత్రిలో సౌకర్యాల లేమి గురించి వైద్యాధికారులను కలిసి సమస్యలపై స్పందించాలని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సుంకర శ్రీనివాస్ గారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం రిమ్స్ ఆసుపత్రి చేరుకుంటున్న రోగులకు సౌకర్యాల లేమి ప్రస్ఫుటంగా కనిపిస్తుందని ముఖ్యంగా ఆక్సిజన్ కొరత వల్ల ఇక్కడ చేరినటువంటి రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. రిమ్స్ ఆస్పత్రిలోని రోగుల కుటుంబ సభ్యులు అందించిన సమాచారం ప్రకారం ఆసుపత్రిలో సౌకర్యాల లేమి మరియు ప్రాణవాయువు కొరత కారణంగా తమ వారు తమ కళ్ళముందే విలవిలలాడుతున్నారని వారి మొర ఆలకించే వారే కరువయ్యారని కన్నీటి పర్యంతం అవుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా పౌరులు తమ ప్రాణాలను కోల్పోవడం దురదృష్టకరమన్నారు. కావున ప్రభుత్వం మరియు జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు కావలసినటువంటి సంపూర్ణ వైద్య సదుపాయాలను సమకూర్చడమే కాకుండా ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ నాయకులు తోట బాలసుబ్రహ్మణ్యం నగర పార్టీ నాయకులు సురేష్ విజయ్ వినయ్ బాబయ్య తదితరులు పాల్గొన్నారు.