కోటబొమ్మాళి, (జనస్వరం) : జలుమూరు మండలం నుండి కోటబొమ్మాళి ప్రాంతానికి అక్రమంగా ఇసుకని తరలిస్తున్న భారీ వాహనాలను ఆడుకున్నారు సెబ్ పోలీసులు. ఈ సంఘటనపై నరసన్నపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు జయరాం గారు స్పందిస్తూ మా నియోజకవర్గంలో ఎప్పటి నుండో ఇసుక అక్రమ దందా నడుస్తున్నా, పాలకవర్గం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నింటా పారదర్శక పరిపాలన అంటూ మాయమాటలు చెప్తూ ప్రజల్ని మభ్య పెడుతూ వెనుకవైపు నుండి ఇటువంటి అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారని, సామాన్యులకు దొరకని ఇసుక, ఇలాంటి అక్రమార్కులకు విచ్చలవిడిగా లభించడం శోచనీయమని అన్నారు. కేవలం నరసన్నపేట నియోజకవర్గంలో మాత్రమే కాకుండా జిల్లాలో చాలా ప్రదేశాల నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటున్నారని, పూర్తిస్తాయిలో ఈ ఇసుక మాఫియాపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనిపై త్వరలో జనసేన పార్టీ తరపున జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయనున్నట్టు తెలిపారు. అమాయక ప్రజల్ని ఎవరూ ఎక్కువ కాలం మోసం చేయలేరని, ప్రభుత్వ అండతో నియోజకవర్గంలో జరుగుతున్న అనేక అక్రమాలను త్వరలోనే వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు తాము చేపడుతున్నట్టు తెలిపారు. అడ్డూ అదుపూ లేకుండా విపరీతంగా ఇలా ఇసుకని తరలిస్తూ ఉంటే భవిష్యత్తులో మన జీవనాధారమైన అనేక నదీపరివాహకాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని జయరాం గారు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఈ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న సెబ్ పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు .
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com