● రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి
● లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం
● పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప
●గంగాధర నెల్లూరు జనసేనపార్టీ ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్
వెదురుకుప్పం, (జనస్వరం) : చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉదాహరణగా వెదురుకుప్పం మండల కేంద్రంలోనే రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు జరిగినట్లు దీని పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి చేత సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని మీరే నన్ను శభాష్ అంటారని తెలిపారు. అయితే ఒక స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ తర్వాత రెవెన్యూ సమస్యలను తుంగలో తొక్కారు. జనసేన పార్టీ రైతులకు అండగా ఉండి వెదురుకుప్పం మండలంలో జరిగిన రెవెన్యూ అవకతవకలపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్ డి వో లు సమగ్ర విచారణ జరిపి, స్వయంగా పర్యవేక్షించి మండలంలోని రైతులకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. తొందరలో ఈ సమస్యలు పరిష్కరించకపోతే మండల తహశీల్దార్ ఆఫీస్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని హెచ్చరించారు. గత 20 సంవత్సరాలుగా రైతుల గోడు పట్టించుకోవడంలేదని ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేక రైతులు గగ్గోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పక్షపాతి జగన్ రెడ్డి అని చెప్పిన మాటలు ఉత్తిత్తి మాటలని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చొరవ తీసుకుని అన్ని మండలాల్లో ఉన్న రెవెన్యూ సమస్యలపై తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరుపేదల పక్షపాతిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిలబడతారని, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అభివర్ణించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులతో కలిసి డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, మండల ప్రధాన కార్యదర్శి సతీష్, జనసేన సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవా, ఐటీ సెల్ సురేంద్ర రెడ్డి, వివిధ పంచాయతీల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు.