* ప్రకృతి విపత్తులతో బాధల్లో ఉన్నవారి కోసం జన సైనికులు నిస్వార్థంగా పని చేశారు.
* నెల్లూరు జిల్లా క్రియాశీలక సభ్యుల సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
నెల్లూరు, (జనస్వరం) : ఆపత్కాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో జనసైనికులు అందరి కంటే ముందు నిలిచారని జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కార్యకర్తలను అభినందించారు. కేవలం ఇసుక మాఫియాకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రాజెక్ట్ గేట్లు తీయడంలో అలసత్వం వహించారని, ఫలితంగా గ్రామాలన్నీ ముంపు పాలయ్యాయని స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరులో జిల్లా క్రీయాశీలక సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రజలు నీట మునిగి తీవ్ర కష్టాల పాలయ్యారు. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగినా తన సొంతజిల్లాలో బాధితులను పరామర్శించేందుకు యువకుడైన ముఖ్యమంత్రి అలసత్వం చూపారు. పొరుగున ఉన్న తమిళనాడులో అక్కడి ముఖ్యమంత్రి 68ఏళ్ల వయసులో ప్రజల మధ్య ఉంటున్నారు. ఇక్కడ మాత్రం నామమాత్రంగా హెలికాప్టర్ ద్వారా చూసి కాకి లెక్కలు వేశారు. ఘోర విపత్తు వల్ల అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మంత్రులు, ఎంఎల్‌ఏల జాడ లేదు. ఇలాంటి సమయంలో స్వచ్చంద సంస్థలు, సాధారణ ప్రజలే వరద బాధితులను
ఆడుకున్నారు. ముఖ్యంగా జనసైనికులు, వీర మహిళలు బాధితుల కోసం శ్రమించిన తీరు ప్రశంసనీయం. ఇలాంటి సేవా కార్యక్రమాలే కార్యకర్తలను ప్రజలకు చేరువ చేస్తాయి. వందల సంవత్సరాల క్రితం నుండి నడుస్తున్న పార్టీలతోపాటు ఇరవై ముఫై సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయి. కానీ కార్యకర్తల గురించి ఆలోచించే ఏకైక పార్టీ జనసేన మాత్రమే. ప్రతీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబం కోసం ఐదు లక్షల ప్రమాద బీమా చేయించిన పెద్ద మనసు శ్రీ పవన్ కల్యాణ్ గారిది. స్వార్ధం, స్వలాభం, ఓట్ల కోసం కాకుండా మార్పు కోసం పని చేస్తూ ఉన్నత లక్ష్యం ఆధారంగా ప్రజలకు సేవ చేసేందుకు శ్రీ పవన్ కల్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారన్నారు.
* ప్రమాదంలో మరణించిన క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ.5 లక్షలు
నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని బాలాజీ నగర్ కు చెందిన క్రియాశీలక సభ్యుడు శ్రీ పి.రవి శంకరరావు కొద్ది నెలలకిందట ప్రమాదవశాత్తూ మరణించారు. ఆయన కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కును శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అందించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇటీవలి భారీ వర్హాలు, వరదలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవారికి జనసేన పక్షాన నిత్యావసరాలు అందించారు.