కార్వేటి నగరం ( జనస్వరం ) : నారాయణ వనం మండలం, పాలమంగళం సౌత్ గ్రామంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న కొట్టార్వేడు గ్రామస్తులు అనిల్ కుమార్ ని జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ యుగంధర్ పొన్న పరామర్శించారు. గత ఏడు నెలలుగా కో రెక్టమ్ కాన్సర్ తో బాధ పడుతున్న అనిల్ కుమార్ ను స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కీమోథెరపీ కి ఆర్థికంగా దోహదపడి, ఆ తర్వాత ఆపరేషన్ చేయడానికి ఆర్థికంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సహాయపడాలని ఈ సందర్భంగా మనవి చేశారు. ఈ రాష్ట్రంలో నిరుపేదలైన అనారోగ్య పీడిత ప్రజలకు వైద్యం ఉచితంగా అందించాలని, రూపాయి దాటితే వైద్యం పూర్తిగా ఉచితం చేయాలని కోరారు. అనిల్ కుమార్ కి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పది వేలు ఆర్థిక సహాయం చేశారు. ఇప్పటి వరకు అనిల్ కుమార్ చెన్నైలోని అడయార్ ఆసుపత్రిలో కీమోథెరపీ చేసుకుంటూ, కుటుంబం మూడు లక్షల రూపాయలు అప్పు చేసి ఆరోగ్యం కోసం వెచ్చించారని, ప్రస్తుతం ఆర్థికపరమైన ఇక్కట్ల వల్ల హాస్పిటల్ కి వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. మూడు కీమోథెరపీ లు పూర్తయిందని, ఇంకా అయిదు కీమోథెరపీలు చేయడానికి రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ఆ తర్వాత ఆపరేషన్ కి దాదాపు ఐదు ఖర్చు అవుతుందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నేరుగా అడయార్ క్యాన్సర్ హాస్పటల్ లో అనిల్ కుమార్ కి సహాయపడితే 27 ఏళ్ల వయసులో ఆరోగ్యంగా ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుందని, ఈ రకంగా అనిల్ కుమార్ ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, మండల ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల కార్యదర్శి రూపేష్, వెదురుకుప్పం మండల సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సతీష్, నగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యోగేశ్వర్ పాల్గొన్నారు.