గుంటూరు, (జనస్వరం) : వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా రాష్ట్రంలో ఒక్క అంగుళం కూడా అభివృద్ధి జరగకపోగా ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసేలా తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఛలో చెరుకుపల్లి వేదికగా జనసేన సమరశంఖారావాన్ని పూరిస్తోందని జనసేన పార్టీ అర్బన్ జిల్లా నాయకులు ఆళ్ళ హరి అన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు నేతృత్వంలో ఆదివారం చెరుకుపల్లిలో తలపెట్టిన *ఛలో చెరుకుపల్లి* బహిరంగ సభ గోడప్రతులను శ్రీనివాసరావుతోటలోని జనసేన జెండా సెంటర్లో ఆళ్ళ హరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఆరాచకపాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అవగాహనా రాహిత్య పాలనతో రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్లారని విమర్శించారు. వైసీపీ నేతల అసమర్ధ పాలన వల్ల పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు, రైతులు ఇలా ఏ ఒక్క వర్గంవారు కూడా సంతృప్తిగా ఆనందంగా లేరని ధ్వజమెత్తారు. చివరికి కొన్ని దశాబ్దాల క్రితం కట్టుకున్న పేదల ఇళ్లకు సైతం ఇప్పుడు వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో వేలకు వేలు కట్టాలని ప్రజల్ని జలాగల్లా పీడిస్తున్నారని, డబ్బులు కట్టని పక్షంలో పెన్షన్లు ఆపేయాలని, వారికి అందుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఈ వైసీపీ ప్రభుత్వ నియంతృత్వానికి బలవుతున్నారో వారికి అండగా ఉండేందుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు పార్టీ అధినాయకులందరూ చెరుకుపల్లి బహిరంగ సభ వేదికగా సమరశంఖాన్ని పూరించనున్నారని ఆళ్ళ హరి అన్నారు. ఈ బహిరంగ సభలో జనసైనికులు, వీర మహిళలతోపాటు పార్టీలోని అన్నీశ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు చెన్నా పోతురాజు, బండారు రవీంద్ర, కోలా అంజి, మాదాసు అన్వేష్, తిరుపతి, బాజి, మజ్జిద్, యాకోబు, మదార్ తదితరులు పాల్గొన్నారు.