
● సంస్కారం మరచి మాట్లాడుతున్న మంత్రి రాంబాబు
● జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి
అనంతపురం, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు సొంత డబ్బులతో రైతు భరోసా యాత్ర చేస్తుంటే జీర్ణించుకోలేని వైసీపీ మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారు. మంత్రి రాంబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలో 30 మంది కౌలు రైతులకు, 23న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 45 మంది కౌలు రైతుల కుటుంబాలను కలిసి వారికి మనోధైర్యం నింపడంతో పాటు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారన్నారు. దేశ చరిత్రలోనే ఒక పార్టీ అధినేత సొంత డబ్బులతో రైతులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించక పోయిన పర్వాలేదు కానీ మతి లేకుండా సంస్కార హీనంగా తమ ఉనికికే ప్రమాదం అని అనవసర వ్యాఖ్యలు చేస్తే వైసీపీ నేతలకు పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన్ననలు పొందేందుకు మంత్రులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. పవన్ కళ్యాణ్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని వీటిని జనసైనికులు తిప్పికొడతారని జనసేన ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి హెచ్చరించారు.