• పోలీసుల ఎదుటే వైసీపీ శ్రేణుల వీరంగం
• జనసేన కార్యకర్తలపై దాడి
• జనసేన కార్యకర్తలనే అదుపులోకి తీసుకున్న పోలీసులు
• పెడనలో ఉద్రిక్తత.. ఇరు వర్గాల మీద కేసులు నమోదు
పెడన ( జనస్వరం ) : పెడన నియోజకవర్గంలో సమస్యలపై మంత్రి శ్రీ జోగి రమేష్ ని ప్రశ్నిస్తూ జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ వేసిన గోడపత్రికలు కలకలం సృష్టించాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గోడపత్రికల ద్వారా మంత్రిని ప్రశ్నించగా, పెడనలో వాటిని అతికిస్తున్న జనసైనికుల మీద వైసీపీ శ్రేణులు మూకదాడికి దిగాయి. అర్ధరాత్రి తరుముకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులు చూస్తుండగానే దాడి చేసిన ఘటన శుక్రవారం పెడనలో ఉద్రిక్తతలకు దారి తీసింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన కార్యకర్తల మీద దాడి చేయగా పోలీసులు జనసైనికుల్నే అరెస్టు చేశారు.సయ్యద్ షఫీ అనే కార్యకర్త ఇంటికి కానిస్టేబుల్ వెళ్లి మరీ తీసుకువచ్చి వైసీపీ నాయకులతో దాడి చేయించారు. అర్ధరాత్రి పెడనలో కలకలం రేపిన ఆ ఘటన మీద జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. మొదట న్యాయ విభాగానికి చెందిన నాంచారయ్య నాయుడుతో కలసి స్టేషన్ కు వెళ్లి తమ కార్యకర్తలను వదిలేయాలని కోరారు. స్థానిక ఎస్.ఐ. అందుకు ససేమిరా అనడంతో గొడవ మొదలయ్యింది. తమ కార్యకర్తలను విడుదల చేయాలని రామ్ సుధీర్ నిరసనకు దిగడంతో పాటు తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ నాయకుల మీద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన్ని కూడా అరెస్టు చేశారు. దీంతో జిల్లా నాయకత్వం మొత్తం పెడన తరలివచ్చింది. న్యాయ విభాగం నాయకులు, అధికార ప్రతినిధి పోతిన మహేష్ తదితరులు పోలీసులతో మాట్లాడారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరికి ఇరువర్గాల మీద కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరు పట్ల జనసేన నేతలు విమర్శలు గుప్పించారు. పోలీసుల సమక్షంలో పోలీస్ స్టేషన్ లో దాడి చేయడమేంటని.. సీసీ కెమెరా ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బండి రామకృష్ణ, మండలి రాజేష్, తాడిశెట్టి నరేష్, బూరగడ్డ శ్రీకాంత్, సందు పవన్, మరీదుశివరామకృష్ణ, శింగలూరి శాంతిప్రసాద్, బత్తిన హరిరామ్, రాయపూడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.