తిరుపతి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావిస్తారు అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు పేర్కొన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ లక్ష్యమని, తెలుగుదేశం పార్టీ కూడా అదే ధోరణి వ్యక్తపరచడంతో సార్వత్రిక ఎన్నికలకు కలిసి వెళ్లాలని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారన్నారు. జనసేన – తెలుగుదేశం పార్టీ పొత్తును జనసైనికులు, నాయకులూ స్వాగతిస్తున్నారని, ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనే దానికంటే ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఇరుపార్టీలు పని చేస్తాయని చెప్పారు. ఆదివారం తిరుపతి నగరంలో పూతలపట్టు, పుంగనూరు, చిత్తూరు, పీలేరు, కుప్పం, తంబళ్లపల్లి నియోజకవర్గాల నాయకులు, క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యచరణపై నాగబాబు గారు జనసేన శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనాగబాబు గారు మాట్లాడుతూ “మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన విధానం బాధ కలిగించింది. రాజకీయ కక్ష సాధింపులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు గారితో ములాఖత్ అనంతరంపవన్ కళ్యాణ్ గారు పొత్తుపై నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని జనసైనికులు, వీరమహిళలు, నేతలు స్వాగతిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళతాం. అలాగే బీజేపీతో పొత్తుపై త్వరలో స్పష్టత వస్తుంది. అయితే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. నీచ, అవకాశవాద రాజకీయాలకు జనసేన దూరం. ఒకరు కింద పడితే వాళ్లను తొక్కేసి పైకి రావాలనే ధోరణి జనసేనకు లేదు. గత ఏడాది విశాఖలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అక్రమంగా నిర్భందిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు ఆయనకు అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు అండగా నిలబడటం మన బాధ్యత. ఆ మానవత్వంతోనే పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి 99 శాతం మంది జనసైనికులు, చాలా మంది తటస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
* ప్రజాసేవ చేసే వారికే టికెట్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుల అరాచకాలు, అన్యాయాలు, అవినీతి విపరీతంగా పెరిగిపోయాయి. వాళ్ల అవినీతిని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అధికారమదంతో అక్రమ కేసులు బనాయించినంత మాత్రాన జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు భయపడరు. భూకబ్జాలు, స్కాములు చేసో మా నాయకులు కేసులు ఎదుర్కోవడం లేదు. ప్రజల తరఫున పోరాటం చేసి కేసులు ఎదుర్కొంటున్నారు. కోట్లాది రూపాయల ఆస్తులున్న నేతలు జనసేనకు అవసరం లేదు. ప్రజాసేవకులు ముఖ్యం. అవినీతిపరులు, అక్రమార్కులకు జనసేనలో సీట్లు ఇచ్చేది లేదు. ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉన్నవారికే టిక్కెట్ ఇస్తాం. క్రియాశీలక కార్యకర్తలే జనసేన పార్టీ బలం. ఒక్కొక్క కార్యకర్త తమ గ్రామాల్లో తటస్థ ఓటర్లు పదిమందితో పార్టీకి ఓటు వేయించేలా పనిచేయాలి. త్వరలోనే వారాహి విజయయాత్రను రాయలసీమ జిల్లాల్లో కూడా నిర్వహిస్తాం” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి, కాన్ ప్లిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. హరిప్రసాద్, తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్, తిరుపతి పట్టణ అధ్యక్షులు జె.రాజారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కీర్తన, పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, జనసేన పార్టీ ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్ కలికొండ శశిధర్, జిల్లా కమిటీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.