జగ్గంపేట ( జనస్వరం ) : వెంగయమ్మపురంలో ఉపాధి పనుల్లో జరిగిన అవకతవకలు నిగ్గు తేల్చాలని ఏడురోజులుగా జగ్గంపేట జనసేన ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్య చంద్ర చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను సోమవారం రాత్రి విరమించారు. ఎట్టకేలకు జిల్లా కలెక్టరు సంతకంతో కూడిన లేఖను ఏపీడీ ప్రసాదరావు, ఇన్‌ఛార్జి డీఎస్పీ అప్పారావు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు సూర్యచంద్రకు అందజేయడంతో రాత్రి 11 గంటల సమయంలో సూర్యచంద్ర దంపతులు దీక్షను విరమించేందుకు అంగీకరించారు. జనసేనపార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పంతం నానాజీలు వెంగయమ్మపురం చేరుకుని నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దుర్గేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇటువంటి అవినీతి అక్రమాలు బయటపెట్టేందుకు జనసేనపార్టీ ముందుంటుందన్నారు. ఉపాధికూలీలు, గ్రామస్థులు జన సైనికులు ఆనందంతో బాణసంచా కాల్చారు. అనంతరం 108 వాహనంలో జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సీఐ సూర్య అప్పారావు ఆధ్వర్వంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అంబుడ్స్ మెన్ నివేదిక అధారంగా డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటూ ఉన్న లేఖను సోమవారం రాత్రి అధికారులు సూర్యచంద్ర వద్దకు తీసుకెళ్లారు. పరిశీలించిన ఆయన లేఖ మొత్తం డ్వామా పీడీ విడుదల చేసినట్లు ఉండడంతో దీనిపై కలెక్టర్ స్వయంగా ఉత్తర్వులు జారీ చేసేవరకు తాను దీక్షను విరమించబోనని పట్టుబట్టారు. అనంతరం రాత్రి కలెక్టర్ సంతకంతో కూడిన లేఖ రావడంతో దీక్ష విరమించారు. గ్రామ ప్రజలు, జనసైనికులు సూర్యచంద్ర గారి పోరాటపటిమను అభినందిస్తున్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com