తిరుపతి ( జనస్వరం ) : జగన్ మోహన్ రెడ్డి డబ్బుతో రాష్ట్రాన్ని గబ్బు పట్టిస్తున్నారన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. ఆదివారం ఎమ్మార్ పల్లిలో జనసేన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పదవి కోసం ప్రజలను బలి ఇచ్చేవాడు ఎప్పటికీ రాజు కాలేడన్నారు. వైసిపి నాయకులు ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేసి అధికార పార్టీకి చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులతో వ్యవస్థలను నడిపిస్తున్నారన్నారు. రాజరికంలో రాజ్యపాలన ఎలా ఉందో రాజు మారువేషంలో వెళ్లి తెలుసుకునేవారన్నారు. కానీ వైసిపి పాలన లో నోరెత్తితే అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి ఈకలు పీకేసి నాలుగు గింజలు వేస్తే ఆ నొప్పి మర్చిపోతుందని, అలాగే నాలుగున్నరేళ్లు ప్రజలను పీడించి ఇప్పుడు అభివృద్ధి అంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. జగన్ ఒక్క అవకాశం అంటే మంచిగా పరిపాలిస్తాడని అందరూ అనుకున్నారన్నారు. ముఖ్యమంత్రి కావడం కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి… డబ్బు సంపాదిస్తే చాలనుకుంటున్నాడన్నారు. ఆ డబ్బును పంచేసి మళ్లీ అధికారంలోకి రావచ్చనుకుంటున్నాడన్నారు. సిఎం కాకముందు నేల మీద నడిచిన వ్యక్తి.. సిఎం అయ్యాక హెలికాఫ్టర్లలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాలను డబ్బుతో శాసించాలనుకున్న కెసిఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. పవన్ కళ్యాణ్ రోజుకు రెండు కోట్లు సంపాదిస్తున్నాడని అయినా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను గెలిపించాలనకుంటున్నాడని తెలిపారు. పోలీసు వ్యవస్థ కూడా వైసిపిపై అసంతృప్తి తో ఉందన్నారు. జగన్.. నిరుద్యోగులకు అయిదువేల రూపాయల జీతంతో ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండలు గుట్టల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారని… మౌలిక వసతులు కూడా కల్పించలేదన్నారు. సమాజంలో చదువుకున్న వాడిగా మీ ముందుకు వచ్చానన్నారు. ఎవరు అభ్యర్థి అయినా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాజు మంచోడు అయితేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. దుర్మార్గమైన ప్రభుత్వం గద్దె దించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆనంద్, స్వామినాథన్, నగర ఉపాధ్యక్షులు పార్ధు, యం ఆర్ పల్లి నాయకులు బాల సుబ్రహ్మణ్యం, గాంధీ, లవ కుమార్ రాయల్, మునిరాజా, రంగా రెడ్డి, నగర నాయకులు కిరణ్ కుమార్, మనోజ్ కుమార్, గౌస్ బాషా, జనసైనికులు మోహిత్, తదితర జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.