
సర్వేపల్లి, (జనస్వరం) : ఫించన్ల ఎత్తివేతపై సర్వేపల్లిలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ ప్రజల కోసం పని చేస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తుందా? అని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బొబ్బేపల్లి సురేష్ ప్రశ్నించారు. ప్రజల కోసం పని చేస్తుంటే అర్హులైన లక్షలాది మంది ఫించన్లు ఎలా తొలగిస్తారని నిలదీశారు. ఫించన్ల ఎత్తివేతపై వెంకటాచలం మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పాదయాత్రలో ఆవ్వాతాతలకు మూడు వేలు ఫించన్ ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక ఉన్న ఫించన్లు ఎత్తేస్తున్నారు. మిమ్మల్ని నమ్మి ఓటేసిన అవ్వాతాతలను నట్టేట ముంచుతారా? నిరుపేదలకు వేల ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయన్న ఆలోచన కూడా మీకు లేదా? వైసీపీని అధికారం కట్టబెట్టి రాష్ట్ర ప్రజలు భస్మాసుర హస్తాన్ని తమ నెత్తిన పెట్టుకున్నారు. నోటీసులు ఇచ్చిన లక్షా 60 వేల మందికి సామాజిక ఫించన్లు భేషరతుగా పునరుద్దరించాలని జనసేనపార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఫించన్లు కోల్పోయిన అర్హులు విషయాన్ని తమ దృష్టికి తీసుకువస్తే వారి ఫించన్లు పునరుద్దరించేలా అధికారుల మీద ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఫించన్లు పునరుద్దరించకుంటే జనసేనపార్టీ తరఫున ఉవ్వెత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.