ఆత్మకూరు ( జనస్వరం ) : సంగం మండలం సిద్దిపురం పంచాయతీ అనసూయ నగర్ కు చెందిన ఇళ్ల స్థలాల బాధితులు, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు దాడి భాను కిరణ్ మరియు స్థానిక నాయకులతో కలసి ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సంగం మండల తహశీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి అసత్యాలతో ప్రజలను మభ్య పెట్టడమే ఒక అజెండగా మారింది. దీనికి ఉదాహరణ, గత సంవత్సరం జరిగిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనసూయ నగర్ లో స్థానిక శాసనసభ్యులు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలను కేటాయించకపోవడమే. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం సుమారు 33 మంది అనసూయ నగర్ కు చెందిన పేద ప్రజలకు రెండు లక్షల రూపాయల విలువచేసే ఇళ్ల స్థలాలను మంజూరు చేసినట్లు చూపుతున్నారు. వాస్తవ పరిస్థితుల్లో వారు ఎవరికి ఇప్పటివరకు ఇళ్ల స్థలాలను కేటాయించలేదు. ఈ విషయమై స్థానిక బాధితులతో కలిసి ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఈరోజు సంగం మండల తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పదే పదే అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రాన్ని జపించే ఈ ప్రభుత్వం వాస్తవ రూపంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణగా సంగం మండల కేంద్రంలో ఏర్పాటు చేసి కొంతకాలం ఇక్కడే నడిపిన ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రాన్ని ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణానికి తరలించడమే. దీని కారణం పారిశ్రామిక శిక్షణ కేంద్రానికి సంబంధించి భవన నిర్మాణానికి ఈ ప్రభుత్వం నిధుల కేటాయింపులో చూపిన అలసత్వమే. ఇది ఏ విధమైన అభివృద్ధి వికేంద్రీకరణో పాలకులే తెలియజేయాలి. అంతేకాకుండా ఈ ప్రభుత్వ పాలనలో ఆత్మకూరు అనేక విధాలుగా దోపిడీకి దగా కి గురి కావడం జరిగింది. దశాబ్దాల పోరాటాల ఫలితంగా తెచ్చుకున్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం నిర్మాణ పనులను ఈ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిలిపివేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందంలో భాగంగా ఈ రైల్వే మార్గ నిర్మాణ పనులకు అయ్యే ఖర్చులో సగం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి మరియు అందుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి రైల్వే శాఖకు అప్పజెప్పాలి. 2020 సంవత్సరం నాటికే పూర్తి కావాల్సిన ఈ రైల్వే ప్రాజెక్టు,ఈ ప్రాంత అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా నేటికీ పూర్తికాలేదు. ఇందుకు కారణం నెల్లూరు జిల్లాలో ఈ రైల్వే ప్రాజెక్టుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు సరి కదా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చేయవలసిన నిధులను కూడా విడుదల చేయలేదు. దీని కారణంగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తనవంతుగా విడుదల చేస్తున్న నిధులు కూడా నిరుపయోగంగా మారాయి. అంతేకాకుండా నియోజకవర్గ మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాల కళ అయిన ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో మూలన పడేసింది. ఎప్పటికీ పూర్తి అవుతుందో తెలియక రైతాంగం ఆందోళనకు గురవుతుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి నేటి వరకు పారిశ్రామికంగా ఆత్మకూరు నియోజకవర్గం దగాకు గురికాబడుతూనే వస్తుంది. స్వర్గీయ మాజీ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆత్మకూర్ సమీపంలోని నారంపేట వద్ద ఏర్పాటుచేసిన పారిశ్రామిక వాడలో అట్టహాసంగా శంకుస్థాపన కావించబడిన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ ముఖ్యమంత్రి ఒత్తిడి కారణంగా బద్వేలుకు తరలించడం ఎంతో శోచనీయం. పరిశ్రమ ఏర్పడుతుంది మాకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆత్మకూరు నియోజకవర్గ యువతకు ఈ ప్రభుత్వ హయాంలో తీరని అన్యాయం జరిగింది. నెల్లూరు జిల్లాలోనే అత్యధికంగా సుమారు 80 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన సోమశిల జలాశయం మరియు సంగం బ్యారేజీ ఆత్మకూరు నియోజకవర్గం లోనే ఉన్నప్పటికీ నియోజకవర్గంలోని భూములలో సింహభాగం నేటికీ సాగునీరు నోచుకోక మెట్ట ప్రాంతాలుగా మిగిలిపోవడం అత్యంత శోచనీయం మరియు దుర్మార్గం. తమ కళ్ళ ముందున్న జలాశయాలు నీరునప్పటికీ అవి తమ భూములకు ఉపయోగపడకపోవడం రైతాంగాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. అంతేకాకుండా నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ గుంతల మయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరుసుకొని పై సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో జనసేన పార్టీ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుందని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్, సంగం మండల నాయకులు మావిళ్ళ ఆనందరావు, మోహన్ కృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.