– జగన్ పాలనను బీజేపీ కేంద్ర పెద్దలూ ఇష్టపడటం లేదు
– బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్‌ని ప్రకటించాలి
– విజయవాడ మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
విజయవాడ, (జనస్వరం) : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్‌ని ప్రకటించి రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడా తెరదించాలని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ సూచించారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వస్తున్న ఆయన… ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వంపై స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆదివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి విచ్చేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీల పొత్తు కొనసాగుతోంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేశాం. మంచి ఓటు బ్యాంకు కూడా సాధించాం. కొన్ని చోట్ల గెలుపొందడం కూడా జరిగింది. అయితే కొద్ది రోజులుగా బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్ధి పవన్ కళ్యాణ్ అని అనధికారంగా ప్రచారం సాగుతోంది. దీంతో ఇరు పార్టీల నాయకులతో పాటు ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై నడ్డా స్పష్టత ఇస్తే బాగుంటుంది. ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్‌ని ప్రకటిస్తే ఇరు పార్టీల మైత్రి బలపడి, ప్రజల మద్దతు మరింత లభిస్తుంది. తద్వారా వైసీపీ అరాచక పాలనకు చమరగీతం పాడవచ్చు.
● వైసీపీ దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి
వైసీపీ దాష్టీకాలను అరికట్టి, సీఎం జగన్‌ను ఇంటికి పంపించాలంటే బీజేపీ, జనసేన పార్టీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. దీనికోసం ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణ నడ్డా ప్రకటిస్తే బాగుంటుంది. జగన్ సీఎంగా కొనసాగడం బీజేపీ పెద్దలు కూడా ఇష్టపడటం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక దేవాలయాలపై దాడులు జరిగాయి. పోలవరం, ఉపాధి హామీ పథకం నిధులు భారీగా దారి మళ్లించారు. రైతు భరోసా నిధులు, ధాన్యం కొనగోలు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రకటనలు చేసుకుంటుంది. దీనిపై నడ్డా ప్రజాక్షేత్రంలో జగన్ ప్రభుత్వ తీరును.. అవినీతినీ, అసమర్థతను ఎండగట్టాలి. పోలవరం ప్రాజెక్టు నిధులను పక్కదారి పట్టించి వేలకోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పడం జరిగింది. ప్రాజెక్టులో అక్రమాలు, లోపాలు ఉన్నాయని, నిధులు భారీగా మళ్లింపు జరిగాయని పార్లమెంట్ వేదికగా ఆయన మాట్లాడారు. నిధుల గోల్ మాల్, మళ్లింపుపై ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చేలా ఈ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షులు మాట్లాడతారు’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డివిజన్ ప్రెసిడెంట్ నల్లబెల్లి కనుక, షో మీ గోవింద్, నగర కమిటీ సభ్యులు మోబిన, బుట్ట సాయికుమార్, గన్ను శంకర్, మురళి కృష్ణ, నరేష్, అమ్మవారి ధార్మిక సేవా మండలి సభ్యులు బుద్ధున శివప్రసాద్, కూర్మా రావు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.