గుంటూరు ( జనస్వరం ) : సినీ నటుల అభిమానులు కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర వహించాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ప్రముఖ సినీనటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రెడ్ క్రాస్ సంస్థలో అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ వరుణ్ తేజ్ సినీరంగం ప్రవేశం వెనుక మెగాఫ్యామిలీ అండదండలున్నా తనకు మాత్రమే సొంతమైన నటనతో సినీపరిశ్రమలో ప్రత్యేక స్థానం పొందారని కొనియాడారు. అతి తక్కువ సినిమాలలో మాత్రమే నటించినా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో వరుణ్ తేజ్ చోటు సంపాదించుకున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా యువత రాజకీయంగా చైతన్యం కావాలని కోరారు. రాజకీయాలకు మనం దూరంగా ఉన్నా మన జీవితాలను రాజకీయాలు ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు. రాష్ట్రాభివృద్ధిని, ముందుతరాల వారి భవిష్యత్ ను సైతం నిర్ణయించే రాజకీయాల్లో యువత రాణించాల్చిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సినీపరిశ్రమలో నటులందరూ ఎంతో సఖ్యతగా ఉంటారని, అభిమానులు సైతం క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన సయ్యద్ షర్ఫుద్దీన్, సోమి ఉదయ్ కుమార్, నండూరి స్వామిలను అభినందించారు. కార్యక్రమంలో కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు సోమీ శంకరరావు, వడ్డె సుబ్బారావు, గడ్డం రోశయ్య, తేజ, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com