విజయనగరం ( జనస్వరం ) : ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడి బడ్జెట్ అని జనసేన నాయకులు గురాన అయ్యలు విమర్శించారు. ఈ బడ్జెట్‌లో అంకెలు తప్పా ఏమీ కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు. రూ.2.79లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సంక్షేమానికి, అభివృద్ధికి పొంతన లేదన్నారు. కేవలం మద్యం రూపంలోనే ఆదాయం పెంచుకోవడం పద్దతి కాదన్నారు. ఆర్ధిక క్రమశిక్షణ లేని బడ్జెట్‌ను మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారని విమర్శించారు. ఆదాయం ఎంతో, ఖర్చు ఎంతో చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. అప్పులను ఆదాయంగా చూపించడం దారుణమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగకరంగా లేదని విమర్శించారు. సాగు,తాగు నీటి ప్రాజెక్టు లకు తగినంత కేటాయింపులు లేవన్నారు. వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూడటం భావ్యం కాదన్నారు. బడ్జెట్‌లో ఎక్కువ భాగం నిధులు డైరెక్ట్ బెనిఫిట్ స్కీంల కోసం కేటాయించారని, జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని స్పష్టమవుతున్నదన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ “అభివృద్ధి నిల్ ,అప్పులు ఫుల్ అన్నట్లుగా వుంది” అని ఎద్దేవా చేశారు.