జగ్గంపేట ( జనస్వరం ) : మిచౌంగ్ తుఫాను ప్రభావం వలన గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నియోజకవర్గంలో అనేక గ్రామాలలో నీట మునిగిన పంటలను, ధాన్యం కళ్ళాలలో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిచి పోవడం జరిగింది. ధాన్యం కళ్ళాలలో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులను జనసేన నాయకులతో పాటుగా వెళ్లి కలిసి వారికి ధైర్యం చెప్పిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన ధాన్యం రాశులు చేతికందే సమయానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ ఆలస్యం చేయడం వలన పండించిన పంట తడిచిపోవడం వలన మేమంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ గత 18 రోజుల నుండి ధాన్యం కళ్ళాలలో ఆరబోసి ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం వలన గత మూడు రోజుల క్రితం వచ్చిన తుఫాను వలన ఎండిన ధాన్యం మొత్తం తడిచి మొలకెత్తడం వలన, ధాన్యాన్ని కొనే నాథుడు లేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. ఈ పంట నష్టానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రైతులకు నష్టం కలగకుండా వారికి గిట్టుబాటు ధరను కేటాయించి తడిచిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని జనసేన పార్టీ తరుపన డిమాండ్ చేశారు.