దర్శి, (జనస్వరం) : ప్రకాశం పశ్చిమ ప్రాంతాలు నీటి ఎద్దడితో ఇప్పటికీ అలమటిస్తున్నాయి. వలస పోయే పరిస్థితి నుంచి ఇంతవరకు ఆయా ప్రాంతాల ప్రజలకు విముక్తి కలగలేదు. దొనకొండ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చారిత్రక అవసరం. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా దర్శి పశ్చిమ ప్రాంతాలకు కూడా మేలు చేకూర్చాలి. పరిపాలనా సౌలభ్యం కోసం దర్శి రెవిన్యూ డివిజన్ ఏర్పాటు ఎంతో అవసరం. దానికి ఈ ప్రాంత ప్రజలందరూ గౌరవించే దర్శి మాజీ శాసన సభ్యులు స్వర్గీయ నారపుశెట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం సముచితం. ప్రస్తుత ప్రకాశం పశ్చిమ ప్రాంతాలు అయిన దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలలోని సుమారు 25 మండలాలతో దొనకొండ జిల్లాకేంద్రంగా స్వాతంత్ర్య సమరయోధుడు, కనిగిరి ప్రాంతానికి చెందిన స్వర్గీయ దర్శి చెంచయ్య గారి పేరిట జిల్లా ఏర్పాటు చారిత్రిక అవసరమని, గిద్దలూరు నియోజకవర్గంలోని ఒకటి రెండు మండలాలను మినహాయిస్తే, మొత్తం మీద గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, దర్శి నియోజకవర్గాలలోని అన్ని మండలాలకు 'దొనకొండ' చాలా దగ్గరగాను, ప్రయాణానువుగాను ఉంటుందని, ఎక్కువ వ్యయము లేకుండానే, గొప్ప జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేయుటకు కావాల్సిన వనరులను కలిగి ఉందని, కనుక ప్రభుత్వము ఈ దిశగా ఆలోచించాలని జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి బొటుకు రమేష్ బాబు ప్రభుత్వానికి సూచించారు. అనాదిగా ఎంతో నిర్ల్యక్ష్యానికి గురి అయిన ఈ దర్శి-దొనకొండ ప్రాంతాన్ని అభివృద్ధిచేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర రాజధాని ప్రస్తావన వచ్చిన సందర్భంలో అప్పటి ప్రధాన ప్రతిపక్షముగా వున్న నేటి అధికారపార్టీ దొనకొండని రాజధానిగా సూచనలు చేసినట్లు వార్తలు వచ్చాయని, ఆ రకంగా ఈ ప్రాంత ప్రజలు తమ ప్రాంతం రాష్ట్ర రాజధాని అవుతుందని ఆశించారని, అది జరుగకపోవడంతో తీవ్ర నిరాశకు గురి అయ్యారని అన్నారు. తరువాత గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో దొనకొండను పారిశ్రామిక వాడగా అభివృద్ధిచేస్తారు అని ప్రచారంలోకి వచ్చిందని, అది నేటికీ కార్యరూపం దాల్చకపోవడం శోచనీయమని అన్నారు, అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతానికి లబ్ది చేకూరుస్తామని దశాబ్దాల కాలంగా గత ప్రభుత్వాలన్నీ చెప్తూ వచ్చాయని, కానీ ఆ దిశగా కూడా ఎటువంటి పురోగతీ లేకపోవడం ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ప్రస్తుత వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ కొత్త రాజధాని అంశం చర్చకు వచ్చినపుడు ఆ కల నెరవేరుతుందని భావించారని, కానీ అది మూడు రాజధానుల ప్రస్తావనలో తెరమరుగు అయిపొయిందని, ఇప్పుడు మళ్ళీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది కనుక ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, అభివృద్ధి దృష్ట్యా, ఈ ప్రాంతంలో వున్న బ్రిటిష్ కాలం నాటి ఎయిర్పోర్ట్, రైల్వే మార్గం, అనువైన ప్రభుత్వభూములు, ప్రసిద్ద ప్రాచీన బౌద్దారామం మొదలగు వనరులదృష్ట్యా, ఇప్పటివరకు రాష్ట్ర రాజాధానిగా కలలు కన్న ఈ ప్రాంత ప్రజానీకానికి కనీసం జిల్లా కేంద్రంగా అన్నా న్యాయం చేయాల్సిన అవసరముందని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు గౌరవించవల్సి ఉందని రమేష్ బాబు అన్నారు. దొనకొండలో వున్న వనరులను అభివృద్ధి చేసి, వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణమ్మ నీళ్లు ఇచ్చి, జిల్లాకేంద్రంగా చేసి, బౌద్దారామం చందవరంని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తే, ప్రభుత్వానికి ఆదాయంతో బాటు, ప్రజలకు కావాల్సినన్ని ఉపాధి అవకాశాలు వస్తాయని, ప్రకాశం పశ్చిమ ప్రాంతాల వారిని వలసవెళ్లే దుస్థితినుండి కాపాడినట్లు అవుతుందని, ఇది చారిత్రిక అవసరమని రమేష్ బాబు అన్నారు. ఈ ప్రత్యేక జిల్లాలో ప్రస్తుతమున్న మార్కాపురం రెవిన్యూ డివిజన్ తో బాటు, దర్శిలో మరొక రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే పరిపాలన సౌలభ్యంతో బాటు, ప్రజలకు అందుబాటులో ఉంటుందని, దానికి ఈ ప్రాంత ప్రజలందరూ గౌరవించే దర్శి మాజీ శాసన సభ్యులు శ్రీ నారపుశెట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని రమేష్ బాబు సూచించారు. అదేవిధంగా జిల్లాకి కనిగిరి నియోజకవర్గం లో పుట్టిన స్వాతంత్ర్య సమరయోధుడు, దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి రాజకీయ డిటెన్యూ, సంఘ సంస్కర్త అయిన స్వర్గీయ దర్శి చెంచయ్య గారి పేరు పెట్టడం సముచితమని ప్రభుత్వానికి విన్నవించుకొంటున్నానని రమేష్ బాబు అన్నారు. అదేవిధంగా బ్రిటిష్ కాలంలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఈప్రాంతానికి కృష్ణమ్మతల్లి నీళ్లు తీసుకురావడానికి, వెలిగొండ ప్రాజెక్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తన జీవితాన్ని దీనికోసమే అంకితం చేసిన అమరజీవి - గిద్దలూరు నియోజకవర్గం, కంభం గ్రామానికి చెందిన స్వర్గీయ శ్రీ కే వీ సుబ్బారెడ్డి గారి పేరుతో వెలిగొండ ప్రాజెక్ట్ కాలువనేర్పాటు చేసి ఈ ప్రాంతానికి లబ్ది చేకూర్చాలని రమేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com