Search
Close this search box.
Search
Close this search box.

ఇజం ( ISM )

ఇజం

“తలదించి ఒకసారి నన్ను చూడు”
“నేనెందుకు దించాలి? నిన్ను ఎందుకు చూడాలి?”
“చూస్తేనే కదా తెలుస్తుంది”
“ఇంకేం తెలియాలి? నాకు అన్నీ తెలుసు. కొత్తగా ఏముంటాయి నువ్వు చెప్పడానికి, నేను వినడానికి?”
“నిజమే…కొత్తగా తెలుసుకోవాల్సింది తప్ప… కొత్తదేమీ లేదిక్కడ!”
“నేను చెప్పేదీ అదే కదా…”
“సరే, అలాగే అనుకుందాం….ఇవి ఒకసారి చూడు….”
“ఏముంది వీటిలో?
“నువ్వే చూసి చెప్పు….”
“ఏంటిది? కొత్తగా వచ్చిన కోడలు ఇంటి పనులు చేస్తుందని పెద్దవాళ్ళు ఆశ పడితే, ‘మీరే చేసుకోండి మీ పనులు బోడిముండల్లారా’ అని ఆమెతోనే వాళ్ళని తిట్టించాడు. ఏంటి ఈయన?
              “అదే మరి చలం మ్యాజిక్. ఆ రోజుల్లోనే ఆడవారి కష్టాలు గురించి, వాటిని ఎలా అధిగమించాలని మాట్లాడాడు. ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక అందం, అర్థం, సంపూర్ణత్వం సిద్ధింపజేసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. అందుకే అంటారు, చలం తన సమకాలీనుల కంటే వంద సంవత్సరాల ముందు జన్మించాడు కానీ అతని ఆలోచనలు ప్రస్తుత తరానికి వంద సంవత్సరాల ముందు ఉంటాయని.”
— — —  — — — 
“సరే, ఇది చూడు”
“ఇదేంటి? పెళ్లి నాటకం ఆడటం, తొలిరాత్రినాడే ఆమెను చంపాలనుకోవడం? ఎంత క్రూరం?”
              “క్రూరాన్ని తెలివితో ఎదురుకుంది ఆ అమ్మాయి. తెల్లారేదాకా మాటల్లో పెట్టడానికి కథలు చెప్పటం మొదలుపెట్టి, ఉత్కంఠ కలిగించి, చివరిలో ఆపి, మిగతాది రేపు చెప్తాను అంటే ఇక ఆమెను చంపగలడా? పనికిరాని వారిగా తయారైన రాజు కొడుకులని మార్చడానికి ఈ ‘అరేబియన్ నైట్స్’ లాంటివి ఉపాయోగపడవా?”
— — —  — — — 
“ఇప్పుడు ఇది చూడు…”
“ఎవరు ఈయన? ఏకంగా దేవుడితో ఢీ అంటున్నాడు?”
            “సమాజం ప్రగతి నిరోధకంగా మారుతున్న తరుణంలో ఆ మూఢత్వం మీద యుద్ధం ప్రకటించాడు ఈయన. సాహితీ ధృవతార గురజాడ. ‘మీ పేరేమిటి’ రచనలో మతం పేరుతో జరిగే మోసాలను కళ్లకు కట్టినట్లు చెప్పారు.”
— — —  — — — 
“ఇంకా చూడు. నీకు చాలా కనిపిస్తాయి”
“ఇదేంటి? నాకు అర్ధం కావడం లేదు”
                  “ఇది ‘ఎస్తర్’ అని తమిళం. ఒక ఊరు, అందులో ఒక ఉమ్మడి కుటుంబం. ఆ ఊరిలో కరువు. తినడానికి మెతుకు లేక వలస వెళ్ళిపోవాలి. ఇంట్లో చావుకి సిద్ధంగా ఉన్నా చావు రాని ముసల్ది. వెంట తీసుకువెళ్ల లేక ఆమెని అక్కడే వదిలి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణానికి ఒక రోజు ముందు ముసల్ది చస్తుంది. కార్యక్రమాలు పూర్తి చేసి వలస వెళ్తారు. ఎస్తర్ ముసలామె పెద్ద కూతురు. ఆమెకి పోయినామె కళ్ళు గుర్తొస్తూ ఉంటాయి. పైకి చూస్తూ అలా ఉండిపోయిన కళ్ళు.”

“ అంటే….నువ్వు అనేది? ”
“ హ్మ్….చాలా సేపటికి అర్ధమైంది కదూ? ముసలామెని చంపింది ఎస్తర్. కరువు కదా. మిగిలిన వారు బతకాలి మరి…. ఒళ్ళు జలదరించిందా?”
— — —  — — — 

“ఇంకా చెప్పు…చాలా ఉత్సుకత రేపుతున్నాయి నువ్వు చెప్పేవి… “
ఇంకా చెప్పాలంటే…
ఒక ప్రేమచంద్ — బీదా బిక్కి, మధ్యతరగతి తలపోట్లు అన్నీ నెత్తికి ఎత్తుకున్నాడు. కులాల వ్యవస్థ, అంటరానితనం గురించి ‘సద్గతి’ అని మురికి పట్టేసిన సమాజం గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పాడు.
ఒక గొగోల్ — ఓ గుమస్తా, ఆయన చలి కోటు గురించి ‘ది ఓవర్ కోట్’ అని వ్రాశాడు. కొందరికి కనీస మర్యాద ఇవ్వని ఈ సమాజంలో ఆ మర్యాద పొందడానికి అతగాడు ఈ కోటు ద్వారా చేసే ప్రయత్నం. 170 ఏళ్ల క్రితం సాక్షాత్కారం కలిగించిన కథ. గొగోల్ అందించిన ఆ టార్చ్ ఆ తర్వాత చాలా మందికి ఉపయోగ పడింది.
ఒక ఖలీల్ ఘిబ్రన్— జీవితానికి తన మనసు లోతుల్ని గానం చేసే గాయకుడు దొరకనప్పుడు, అది తన మనసుని విప్పి చెప్పడానికి ఒక తాత్వికుడు వెతుక్కుంటుంది, అని తను చదివిన జీవితం మీద గొప్ప తత్వ బోధ చెప్పాడు.
ఒక చాగంటి సోమయాజులు (చాసో) — కళింగాంధ్ర నేలకు పేరు తెచ్చిన రచయిత. ‘చా.సో కథలు’ ఒక ఎత్తు అయితే, ‘ఎందుకు పారేస్తాను నాన్నా’ అని దిగువ తరగతి ప్రజల స్థితిగతులకు అద్దం పడుతూ ఒక చిన్నారి హృదయాన్ని హృద్యంగా చిత్రీకరించిన కథ మరో ఎత్తు. ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా చదివి ఆచరణలో పెట్టితీరాలనే నీతి చెప్పిన కథ.”
ఒక సింగమనేని నారాయణ — రాయలసీమ అస్తిత్వ పోరాటానికి సాహితీ పరిమళాలద్దిన కళారత్న. ‘న్యాయమెక్కడ’ అన్న తొలికథ. ఆయన ఏ రంగం గురించి కథలు రాసినా అందులో రైతులు, వ్యవసాయం అంతర్లీనంగా ఉంటాయి.
ఒక కాళీపట్నం రామారావు (కారా మాష్టారు) — ఒక కథా రచయితగా ఎన్నో కథలు వ్రాశారు. ఒక ఉపాధ్యాయుడు తల్చుకుంటే పిల్లలతో ఎలాగైనా చదివిస్తాడు. అందుకే కాబోలు ‘కథానిలయం’ ప్రారంభించి అందులో రెండువేలకు పైగా కథల సంపుటాలు, కథా రచన గురించిన పుస్తకాలను ఉంచారు.
‘ఒక్క సిరాచుక్క లక్షమెదళ్ల కదలిక’ అని నినదించిన కాళోజి, తెలంగాణ నిత్యస్ఫూర్తి. “చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అని శ్రీ కందుకూరి వీరేశలింగం. భారతీయత మీద, తెలుగుదనం తెలుగుదనం మీద అభిమానంతో పాటు తన అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా తెలిపుతూ తన రచనల్లో లోకానుభవం చూపిన విశ్వనాథ సత్యనారాయణ.
ఓ డాక్టర్… ఎందుకు విప్లవకారుడు అయ్యాడు? గాయపడిన తన శత్రువులకు ఎందుకు వైద్యం చేశాడు? “హస్తా లా వికితోరియా సిఎంప్రే” (వీర మరణం పొందే వరకూ విజయం కొరకే) అని ఎందుకు నినందించాడు? అదే చే గువేరా. ప్రపంచం వ్యాప్తంగా యువతకు చే గువేరా అంటే విపరీతమైన అభిమానం. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన వారు చే జీవితంలో ఘట్టాల్ని తెలుసుకొని తిరిగి చైతన్యం తెచ్చుకుంటున్నారంటే అతిశయోక్తి కాదేమో.
— — —  — — —
“బాబోయ్…ఇన్ని ఉన్నాయా తెలుసుకోవడానికి?”
“మరే, కొత్తగా తెలుసుకోవాల్సింది తప్ప… కొత్తదేమీ లేదిక్కడ!” ఇవన్నీ నాకు ఎందుకు చెప్పినట్టు? చెప్పినట్టు కాదు, నేర్పినట్టు. మనల్ని మనం తెలుసుకోవాలన్నా, మలచుకోవాలన్నా, మనది కాని ప్రపంచాన్ని చూడాలన్నా, ఎదుట వారి వైపు నుండి ఆలోచించాలన్నా, తర్వాత అలాంటి సందర్భం వస్తే వాళ్ళ సమస్యని అర్థం చేసుకోవాలన్నా, ఒకర్ని ప్రేమించాలన్నా, ఒక నాయకుడిని అనుసరించాలన్నా, అతని సిద్ధాంతాలు, రాజకీయవాదం తెలియాలన్నా….ఇలా ఏది తెలుసుకోవాలన్నా నువ్వు తలదించటం ముఖ్యం.
“ఇంతకీ నువ్వు ఎవరో, ఏం చేస్తావో చెప్పలేదు?”
“నేను పుస్తకం. నువ్వు తలదించి నన్ను చదివితే, నిన్ను తలెత్తుకునేలా చేసేది నేనే….! మస్తకాన్ని కూడా మార్చే పుస్తకం గొప్పది.” మనం చదివే పుస్తకం మన జీవితాన్ని మార్చి వేయగలదు. అది యండమూరి ‘విజయానికి అయిదు మెట్లు’ పుస్తకంలో మనిషి వ్యక్తిత్వ వికాసం, మనో విజ్ఞానం పెంపొందేలా కావచ్చు, విప్లవానికి సంబందించిన పోరాటం జరిగేటప్పుడు “మీరు ఎటువేపు” అన్న ప్రశ్న తలెత్తినప్పుడు సమాధానం దొరకచ్చు, శ్రీశ్రీలాంటి ఒక ఒక అభ్యుదయ కవి జీవిత సత్యాలు ద్వారా స్ఫూర్తి పొందచ్చు…. అందుకే అన్నారు ఆయన… “కుదిరితే పరిగెత్తు…లేకపోతే నడువు… అదీ చేతకాకపోతే..పాకుతూ పో…అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు” అని. What is your ‘Ism?’ నీ ‘ఇజం’ ఏంటి అంటే ఏం చెప్తావు? నువ్వు నమ్మిన సిద్ధాంతం కదూ? దాని ప్రేరణ ఎక్కడ అంటే? వెతుకు, తలదించి చదువు. నీ ‘ఇజం’ అక్కడ నుండే ప్రారంభం కాగలదు.
పైన సంభాషణలో ప్రస్తావించిన రచనలు, ఇంకా బోలెడు చాలా మంది ఇప్పటికే చదివి ఉంటారు. “ఒక పుస్తకం చదువుతున్నాం అంటే మనం ఒక వ్యక్తి యొక్క గాత్రం వింటునట్టు, బహుశా అది వెయ్యేళ్ళ క్రితం మరణించిన వ్యక్తి కావొచ్చు,పుస్తక పఠనం అంటే సమయం ద్వారా ప్రయాణించడం” అన్న కార్ల్ సాగన్ మాటలని ఒకసారి గుర్తు చేసుకుంటూ, అలా చదవనివారు ఉంటే, ఈ సంపాదకీయం వారికి ఒక ప్రోత్సాహం, ఒక నాంది కావాలని మా ఆశ. కళ్ళతో అక్షరాల్ని ఏరుకుంటూ ఊహాలోకాల్లో మనల్ని మనం కోల్పోతాం, అదే పుస్తక పఠనం. ఇందులో నుండి ప్రేమలు పుట్టాయి, విరహాలు ఆవిరైపోయాయి. విప్లవాలు పుట్టాయి, వీరులు పరిచయం అయ్యారు.

హ్యాపీ రీడింగ్….
సర్వేజనా సుఖినోభవంతు.. 


#Written BY
తెలుగు అమ్మాయి
ట్విటర్ ఐడి : @telugulessaa

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way