
ఒక మాట మీద నిలబడవా..? దేవుడితో పెట్టుకోకు..!
వైసీపీ నేతల రాజకీయ ప్రవర్తనలో ఉన్న ద్వంద్వ చరిత్రకి మరో నిదర్శనం అంబటి రాంబాబు తాజా ప్రదర్శన.
నిన్నటి వరకూ ‘‘తిరుమల అన్నప్రసాదం అద్భుతంగా ఉంది’’, ‘‘నిర్వహణ శుభ్రంగా ఉంది’’, ‘‘ఇంత పెద్ద సంఖ్యలో భోజనం సదుపాయం ఎలా మేనేజ్ చేస్తున్నారు అనిపించింది’’ అంటూ నిజాయితీగా మెచ్చుకున్న అంబటి, ఇప్పుడు ‘‘దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు’’, ‘‘బీఆర్ నాయుడు బ్రోకర్’’, ‘‘చంద్రబాబు లడ్డు ప్రసాదంతో రాజకీయాలు చేశాడు’’ అంటూ భగ్గుమంటున్నారు. ఇదేం ప్రవర్తన రాంబాబు..? ఒక మాట మీద నిలబడలేవా..?
మొన్న ప్రశంసలు… నేడు విమర్శలు – ఈ మార్పు ఎందుకు..? :
తిరుమలలో కుటుంబసమేతంగా దర్శనం అనంతరం అన్నప్రసాదం గురించి అంబటి చేసిన వ్యాఖ్యలు మొదటికి సాధారణంగానే అనిపించాయి. కానీ ఆ వీడియో వైరల్ అయ్యాక, రాజకీయ అర్థాలు తెచ్చుకున్నాయి.
టీడీపీ వర్గాలు ‘‘చూడండి.. వైసీపీ నేతలే చెబుతున్నారు.. తిరుమలలో మార్పు వచ్చింది’’ అంటూ ప్రచారం చేసింది. అది జగన్ శిబిరంలో ఇబ్బందిగా మారింది. ఎందుకంటే, జగన్ పాలనలో తిరుమలపై అనేక విమర్శలు వచ్చాయి.. ధార్మిక వ్యవహారాల్లో అవినీతి, నామినేషన్ పోస్టుల్లో కులపరమైన ప్రాధాన్యత, ధార్మిక స్ఫూర్తి కంటే రాజకీయ ప్రాభవం ముఖ్యమైపోవడం మొదలైనవి ప్రజల్లో చర్చనీయాంశాలయ్యాయి. అలాంటి సందర్భంలో అంబటి రాంబాబు చేసిన ప్రశంసలు జగన్‌కు ఏ మాత్రం సౌకర్యకరం కావు.
జగన్‌కు నచ్చని పాజిటివ్ టాక్ :
వైసీపీ వర్గాల్లో ఒక మాట బాగా ప్రచారం.. ‘‘జగన్ రెడ్డి తనకు తప్ప ఎవరూ మంచివారు కారు’’. ఆయనకు ఇతరుల మంచి మాటలు కూడా అసహనమే. అలాంటి పరిస్థితుల్లో అంబటి ‘‘కూటమి ప్రభుత్వం బాగుంది, టీటీడీ నిర్వహణ అద్భుతం’’ అనే టోన్‌లో మాట్లాడడం జగన్ దృష్టిలో ‘నిస్సహకార సంకేతం’. అందుకే, తిరుమల నుంచి వచ్చిన వెంటనే అంబటి ప్రవర్తనలో మలుపు కనిపించింది. గుంటూరు కోర్టు వద్ద జరిగిన వైసీపీ లీగల్ సెల్ కార్యక్రమంలో ఆయన ఒక్కసారిగా మరో అంబటి అయిపోయారు.. తిరుమల ప్రశంసల్ని తిరస్కరించి, ‘‘దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ రాగం మార్చేశారు. ఇది కేవలం పరిస్థితి ఒత్తిడి వల్లనా? లేక జగన్ నుండి వచ్చిన ‘‘వార్నింగ్ సిగ్నల్’’ ఫలితమా? అనే చర్చ ఇప్పుడు వైసీపీ వర్గాల్లో మంటపెట్టేసింది.
దేవుడితో రాజకీయాలు మాట్లాడే అర్హత ఎవరికీ..? :
‘‘చంద్రబాబు దేవుడితో రాజకీయాలు చేశాడు’’, ‘‘బీఆర్ నాయుడు బ్రోకర్’’, ‘‘ఎల్లో మీడియా రాజకీయాలు చేస్తోంది’’ అంటూ అంబటి మాట్లాడారు. కానీ అంబటి గారు.. మీరు, మీ నాయకుడు జగన్ రెడ్డి ధార్మిక వ్యవహారాల్లో ఏం చేశారనే విషయం ప్రజలు మర్చిపోలేదు.
టీటీడీ ఆస్తులు అమ్మకానికి పెట్టిన ప్రభుత్వమే జగన్‌ది.
దేవుడి సేవలో ఉన్న శ్రద్ధావంతులను రాజకీయాల పేరుతో అవమానపరచింది అదే ప్రభుత్వం.
మతసహనాన్ని మసిపూసి, భక్తిని బూతుకేసినది కూడా అదే పాలన.
అందుకే ఇప్పుడు ‘‘దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు’’ అనే మీ ఆరోపణ ప్రజల్లో విరుద్ధప్రతిస్పందన కలిగిస్తోంది. ఎందుకంటే ఈ ఆరోపణను చేయగల అర్హత, మీకూ మీ పార్టీకీ ఎక్కడుంది?
వైసీపీలో చలనం.. రూటు మార్చుతున్నారా అంబటి? :
తాజాగా అంబటి పవన్ కల్యాణ్‌పై కూడా సాఫ్ట్ లైన్ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంపై కూడా ఓ మాదిరి పాజిటివ్ టోన్‌లో మాట్లాడారు. ఇప్పుడు తిరుమల ప్రసాదం ప్రసంగం కూడా అదే దిశలోనిది. కానీ ఆ పాజిటివ్ టాక్ బయటకు రాగానే జగన్ శిబిరంలో తుపానులా మారింది. జగన్‌కు నచ్చని మాట మాట్లాడితే ఏమవుతుందో పార్టీ నేతలందరికీ తెలుసు. అందుకే, వెంటనే రూటు మార్చి ‘‘దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ తమ బాస్ సంతోషం కోసం మళ్ళీ పాత తాటిపైకి వచ్చినట్లు అంబటి ప్రవర్తించారు. అదేంటంటే.. ప్రజల ముందు ఒక రూపం, జగన్ ముందు మరో రూపం!
టీడీపీ సర్కిల్స్‌లో సంతోషం, వైసీపీ సర్కిల్స్‌లో షాక్ :
టీడీపీ సానుభూతిపరులు ఇప్పుడు అంబటి వీడియోను బంగారంలా పంచుకుంటున్నారు.
‘‘వైసీపీ నేతలే చెబుతున్నారు.. తిరుమల మారింది!’’ అంటూ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం అప్రతిభగా మౌనం పాటిస్తున్నారు. ఎందుకంటే, నిజాయితీగా మాట్లాడిన ఒక్క మాట కూడా ఇప్పుడు పార్టీకి కష్టం తెస్తోంది. ఇంతలో అంబటి రెండో రోజుకే తన మాటలు మార్చడంతో వైసీపీ కేడర్ అయోమయంలో పడింది.
ఎవర్ని నమ్మాలి? ఏ అంబటినీ నమ్మాలి?
జగన్ దూరం చేయలేని నేతల్లో అంబటి ఒకరు :
వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత చాలా మంది నేతలు కనబడటం మానేశారు. కానీ అంబటి మాత్రం ఇప్పటికీ బహిరంగంగా పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. లోకేష్‌పై, కూటమిపై కఠిన విమర్శలు చేస్తూ పార్టీ బేస్ కాపాడటానికి ప్రయత్నించారు. అందుకే ఆయనపై జగన్ నేరుగా చర్య తీసుకోలేకపోతున్నారు. అంబటిని టచ్ చేస్తే, వైసీపీలో మాట్లాడే నేత ఒక్కరే మిగిలిపోతారు.. అదే పేర్ని నాని! కాబట్టి, అంబటి ఏమి మాట్లాడినా జగన్ కళ్ళు మూసుకొని భరిస్తున్నట్లు రాజకీయ వర్గాల విశ్లేషణ.
ముగింపు :
అంబటి మౌనం కన్నా ప్రమాదకరమైనది ఆయన మార్పు
రాజకీయాల్లో మాటలు పూటకో రూటు మార్చుకుంటే, ప్రజలు నమ్మకం కోల్పోతారు.
అంబటి రాంబాబు ఇటీవల చేసిన ఈ ద్విపాత్రాభినయం అదే సంకేతం.
తిరుమల అన్నప్రసాదంపై ఇచ్చిన ప్రశంసలు భక్తి స్ఫూర్తితో ఉండగా,
తర్వాత చేసిన విమర్శలు పార్టీ స్ఫూర్తితో ఉన్నాయి.
ఇది వ్యక్తిగత నిజాయితీ కంటే, రాజకీయ భయానికి ప్రతీకగా కనిపిస్తోంది.
జగన్ చీవాట్లకు భయపడి, దేవుడితో కూడా రాజకీయం చేస్తే.. అది రాజకీయ దిగజారుడు స్థాయి.
తిరుమలలో చెప్పిన మాటలే ఇప్పుడు రాంబాబు రాజకీయ భవిష్యత్తును పరీక్షిస్తున్నాయి.
‘‘నిన్న దేవుడిని మెచ్చుకున్న అంబటి, నేడు దేవుడితో రాజకీయాలు అంటున్న అంబటి’’ ఏది నిజమైన అంబటి?
ప్రజలే తేల్చాల్సిన సమయం వచ్చింది. దేవుడి పేరు తీసుకున్నవాడు కూడా రాజకీయ లెక్కలకే వంగిపోతే,
ఆ రాజకీయానికి మిగిలేది భక్తి కాదు.. కపటం మాత్రమే!
జమ్ము. సాయి కల్యాణ్,
పొలిటికల్ అనలిస్టు,
మేనేజింగ్ డైరెక్టర్,
జనస్వరం మీడియా.