
అనంతపురం, (జనస్వరం) : ప్రస్తుత పరిస్థితుల్లో గత రెండు సంవత్సరాల నుంచి కరోనా బారినపడి నగర ప్రజల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయిన ఈ సమయంలో అభివృద్ధి ఏమాత్రం చేయని ఈ వైసీపీ ప్రభుత్వం నగరంలోని ప్రజల ఆస్తిపన్నుపై ఉక్కుపాదం మోపడం ఏమాత్రం సమంజసం కాదని జనసేన నగర అధ్యక్షులు బాబురావు పేర్కొన్నారు. ప్రజా క్షేమాన్ని గాలికి వదిలి వారి రక్త మాంసాలను అమ్మి ఖజానాకు డబ్బులు నింపమని పదేపదే ప్రజలపై మునిసిపాలిటి అధికారులతో ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ నగరంలో ఇంటి పన్ను కట్టని పక్షంలో తాగునీటి కనెక్షన్లు కట్ చేస్తామని, ఇంటికి తాళం వేస్తామని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బెదిరింపులు చూస్తుంటే నిజంగానే రాష్ట్రంలో మహిషి పాలన జరుగుతుందనే విధంగా ఉందన్నారు. ఓవర్ బ్రిడ్జ్ వర్క్ వలన నగరానికి నడిబొడ్డున ఉన్న కమలానగర్, సుభాష్ రోడ్‌లోని వ్యాపార సంస్థలు పూర్తిగా చతికిలపడిన విషయం పాలకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇదే విధంగా ప్రజలపై ఒత్తిడి తెస్తే ప్రజల పక్షాన నిలబడి మునిసిపాలిటీ వ్యవస్థను ముట్టడి చేయాల్సి వస్తుందని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామని తెలిపారు.