నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 232వ రోజున 11వ డివిజన్ సరస్వతి నగర్ ఎస్ఎస్ సూపర్ మార్కెట్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలుబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో సభలు, సమావేశాలు జరుపుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని, రాజకీయపార్టీలు సమావేశాలు, ర్యాలీలు, రోడ్డు షోలు నిర్వహించుకునే వెసులుబాటును మహనీయులు భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించారని, కానీ నేడు ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు బహిరంగ సభలను, రోడ్డు షోలపై నిషేధం అంటూ చీకటి జీవో జారీ చేశారని అని అన్నారు. ఈ లెక్కన మన రాష్ట్రంలో అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగాన్ని కాదని జగన్ రెడ్డి ప్రత్యేక రాజ్యాంగాన్ని వ్రాస్తున్నారా అని దుయ్యబట్టారు. ఈ చీకటి జీవో భారత రాజ్యాంగానికి విరుద్ధమని దీనిపై తీవ్ర స్థాయిలో పోరాడుతామని, ఈ వైసీపీ ఆగడాలను ఇలాగే వదిలేస్తే ప్రజల జీవించే హక్కుని కూడా కాలరాస్తారని అన్నారు. రేపటి పవన్ కళ్యాణ్ గారి రథం వారాహిని ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ అడ్డుకున్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.