ఉచిత పథకాలు, తాయిలాలతో అభివృద్ధి సాధ్యమా?
ఉచిత పధకాలు, తాయిలాలుతో అభివృద్ధి సాధ్యమా? ప్రజల జీవన ప్రమాణాలు పెంపుదల సామాజిక అభివృద్ధి సాధన, వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పధకాలు ప్రవేశ పెట్టాల్సి ఉంది. ప్రభుత్వం ప్రజాకర్షణ కోసం దాని ఖజానాని దివాళా తీయించడం ఈరోజుల్లో ఎక్కువ అయిపోయింది. పండిట్ నెహ్రు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులు, విద్యుత్, రహదారులు ఏర్పాటు కార్యక్రమాలు చేపట్టడం వలన నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతీ రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరు కొరత లేకుండా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన ప్రకాశం పంతులు ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించి ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం ఆనకట్ట వంటి నిర్మాణాలు చేపట్టి రాష్ట్రాన్ని సుభిక్షం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో “ గరీబి హటావో” నినాదంతో ప్రవేశపెట్టి 20 సూత్రాల పధకం వల్ల ప్రజలు విద్యా, ఆర్ధిక, సామాజిక రంగాలలో గణనీయమైన పురోభివృద్ధి సాధించారు.
ఇక మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు అప్పటి సామాజిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని 1983 లో అధికార పగ్గాలు చేపట్టిన ఎన్టీఆర్ కూడు, గుడ్డ, నీడ కల్పనలో భాగంగా కిలో 2 రూపాయలకే బియ్యం, జనతా వస్త్రాల పధకం, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పధకం ప్రవేశ పెట్టి అందరి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తరవాత చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ ఉచిత పథకాలకు తెరతీశారు. చంద్రబాబు హయాంలో రంజాన్ తోఫా, సంక్రాంతి కానుకలు ఇతర వర్గాల వారికి ఉచిత కానుకలు అందజేశారు. ఈ పధకాలను డీలర్లు సొమ్ము చేసుకున్నారనే అభియోగం ఉంది. కావలసినవి తోఫాలు, కానుకలు కావు వేళకు నాణ్యమైన సరుకులు. కావాల్సినవి పసుపు కుంకుమ కాదు, ప్రజల కోసం అభివృద్ధి పనులు కావాలి.
ఇక వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరమే అయినా, ఈ పధకం అమలులో అనేక లోపాలు ఉండడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు సొమ్ముచేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. “పేరు గొప్ప ఊరు దిబ్బ” అన్న చందంగా పథకాలకు తండ్రి, కొడుకుల పేర్లు పెట్టుకుని, ప్రజల సొమ్ము ప్రయివేటు పరం చేస్తున్నారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం చాలా ఉచిత పధకాలను ప్రవేశ పెట్టింది. అమ్మఒడి, చేయూత, వృత్తి దారులకు, కళాకారులకు చేయూత, పింఛన్లు పెంపుదల, రైతు భరోసా వంటి పధకాలు మంచివే. అయితే ఈ పథకాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలి. ఈ ఉచిత పథకాలు మరియు తాయిలాలు కోసం ప్రభుత్వం, మౌలిక సదుపాయాల కోసం, విద్య కోసం మరియు వివిధ కార్పొరేషన్ల నుండి నిధులను బదిలీ చేసుకుంటుంది.పైగా ఇచ్చే తాయిలాలు కూడా తమ వారికే లబ్ది చేకూరేవిధంగా,తమకి అక్కరలేని వర్గాలకు అందకుండా పక్షపాత ధోరణి తో వ్యవహరిస్తోంది.తెలియక సామాన్య ప్రజలు మోసపోతున్నారు. ఏపీలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక క్షిణించడం మొదలుపెట్టిన ఆర్ధిక పరిస్ధితిలో ఇప్పటికీ ఏ మార్పు లేదు. అప్పట్లో జీతభత్యాలు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేకపోవడంతో సగం చెల్లింపులే చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు అదే పరిస్ధితుల్లో ఉంది. కాకపోతే ఆలస్యంగా చెల్లింపులు పూర్తి చేస్తున్నారు.అయినా రాష్ట్రంలో సంక్షేమ పథకాల పందేరం మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.ఈసారి పింఛన్ ఎప్పుడిస్తుందో తెలియని పరిస్ధితి.
“కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు” కష్టపడి సంపాదించ కునే వాడికి సోమరి చేసే విధంగా ప్రభుత్వం తాయిలాలు ప్రకటించడం ఆహ్వానించదగ్గది కాదు. విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా దీవెన, కానుకలు ఇవ్వడం ఎంత వరకు సబబు. ఒక చేత్తో ఇచ్చి, మరొక చేత్తో లాక్కోడం విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం పాటిస్తున్న విధానం. ఒక చేత్తో ఇస్తున్నారు మరో చేత్తో లాక్కుంటున్నారు. రైతుకు కావాల్సింది గిట్టుబాటు ధర మరియు సరైన సమయానికి ఎరువులు అనే భరోసా అంతే కానీ ఊరకనే ఇచ్చే సొమ్ము ఏమాత్రం కాదు. రైతుకి ప్రతి సంవత్సరం 7500 ఇస్తున్నాడు. కానీ, గిట్టుబాటు ధర లేక, దళారీల వ్యవస్థతో ఏకరాకు దాదాపుగా 20వేల రూపాయల నష్టపోతున్నాడు. మత్స్యకార భరోసా అని సొమ్ములు ఇచ్చి, డీజిల్ మీద పన్నులు పెంచి ఇచ్చిన సొమ్ము లాగేస్తున్నారు. ఆసరా, భరోసా, కానుక, తోఫా అని పేర్లు పెట్టి ఇచ్చినవన్ని కరెంటు, బస్సు, పెట్రోల్ చార్జీలు పెంచి లాగేస్తున్నారు
నేతన్న హస్తం అని ఇచ్చి, నూలు రేట్లు పెంచి కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాగేస్తున్నారు. వాహన మిత్ర పేరుతో రూపాయి ఇచ్చి, పెట్రోల్ చార్జీలు, జరిమానాలతో రెండు రూపాయలు లాగేస్తున్నారు.. వీటి వలన ప్రజలపై చెడు ప్రభావం పడుతుంది,ఎప్పుడు ప్రభుత్వం ఉచితానుచితాలు ఇస్తుందా అని ఎదురుచూస్తు కష్టపడటం మానేసే రోజులు ముందు ఉన్నాయి.వీటి వలన ప్రజలపై చెడు ప్రభావం పడుతుంది. ఎప్పుడు ప్రభుత్వం ఉచితానుచితాలు ఇస్తుందా అని ఎదురుచూస్తు కష్టపడటం మానేసే రోజులు ముందు ఉన్నాయి.
సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమానంగా పరుగులు తీయిస్తామని ప్రభుత్వాలు చెబుతుంటాయి. అయితే వీటి అమల్లో కీలకమైన ఉద్యోగుల జీతభత్యాలను పెండింగ్ లో పెట్టి వాటిని పరుగులు తీయించే దుస్సాహసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకంటే ప్రభుత్వ పాలన కానీ, పథకాల అమలు కానీ చేయాలంటే తిరిగి అదే ఉద్యోగులుప్రభుత్వం కూడా చేయదు. ఎందుకంటే ప్రభుత్వ పాలన కానీ, పథకాల అమలు కానీ చేయాలంటే తిరిగి అదే ఉద్యోగులు తప్పనిసరి కాబట్టి. కానీ ఏపీలో మాత్రం పరిస్ధితి భిన్నంగా ఉంటోంది. తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఉన్నా లెక్కచేయకుండా సంక్షేమ పథకాల వైపు ప్రభుత్వం పరుగులు తీస్తుంది. గతేడాది అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ ఓటర్లకు ఎన్నో హామీలు గుప్పించింది. వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఉన్న వాటికి తోడు నెలకో కొత్త పథకం జాబితాలో వచ్చి చేరుతోంది. హామీ ఇచ్చిన పథకాలకు తోడు ఎప్పటికప్పుడు తోచిందే తడవుగా కొత్త పథకాలను కూడా ప్రకటించేస్తున్నారు. దీంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి తలకిందులవుతోంది. ప్రభుత్వం ఇలా ఉచిత పథకాల పేరుతో ధనం వెదజల్లుతుంటే, ఆ మొత్తాన్ని సాధారణ పౌరులే తిరిగి చెల్లించాలి. ఎప్పుడు పన్నులు ధనవంతులే చెల్లించరు, పేదవారు కూడా అగ్గిపెట్టెలు నుండి వజ్రాల వరకు పన్నులు చెల్లించవలసి ఉంటుంది. ఓట్ల రాజకీయం పక్కనపెట్టి డోర్ టూ డోర్ సర్వే నిర్వహించి అర్హులకు పధకాలు అందేవిధంగా ప్రయత్నించాలి.అంతే కాకుండా ప్రజలు సోమరితనం వైపు దృష్టి సారించకుండా బ్రతకడం నేర్చుకునే విధంగా ప్రభుత్వం అవగాహన కల్పించకుంటే ఉచిత పధకాలు అందించే రాష్ట్రాలు “వెనిజులా “దేశంలా మారే ప్రమాదముందని మేధావులు హెచ్చరిస్తున్నారు.
రాజకీయ పార్టీలు ఓటరు యొక్క విధేయత గెలవడానికి ఎన్నికల సమయానికి లేదా ఎన్నికల ముందు ఉచిత పధకాలను ప్రారంభిస్తున్నాయి. ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి అంతే కానీ ఉచిత పథకాలపై కాదు.నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (NUEPA) వారు కూడా ఉచిత పధకాలు అంత మంచివి కాదు అని పేర్కొన్నారు.దీంతో ఇదంతా ఓ ఫాల్స్ ప్రెస్టేజ్ వ్యవహారంగా మారిపోతోంది. సాధారణ ప్రజలకు అభివృద్ధిని అందించడంలో పార్టీలు మరియు ప్రభుత్వాలు విఫలమవడం “ఫ్రీబీస్” యొక్క దృగ్విషయానికి దారితీసింది. ఉచిత పథకాల వలన ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. దీని మూలంగా లోటు పెరుగుతుంది. అవసరమైన పనులకు, ప్రాజెక్టులకు నిధులు సరిపోవు. ఉచిత పధకాలు మరియు సబ్సిడీలు అధికంగా ఇస్తే అది పరోక్షంగా ప్రజల దగ్గర ఉండే డబ్బును పెంచుతుంది, ప్రజలు అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం ప్రారంభిస్తారు, ఇది డిమాండ్ - సరఫరా అసమతుల్యత గొలుసుకు దారితీస్తుంది, డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ధరలు పెరుగుతాయి మరియు ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని మనకు తెలుసు.
ప్రజలకు కావాల్సింది ఉపాధి, నాణ్యమైన సరుకులు, మేలు రకం ఎరువులు, ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్య అంతే కానీ ఉచిత పధకాలు, తాయిలాలు కావు.
పురాణాల్లో బాగా ప్రాచుర్యం ఉన్న ఉచితాల గురించి ఒక సన్నివేశాన్ని మీకు వివరిస్తాను. కృష్ణుడు ధర్మరాజుని ఒక రాజ్యానికి తీసుకు వెళ్ళాడు. ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది. అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది! ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా? అని చెప్పడంతో ఆమె మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది!!! ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు. రాజా... ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణా... మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు... ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు... అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు! తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు! సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం... ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు.
By
గణేష్ నాయుడు టంకాల
ట్విట్టర్ ఐడి : @SingleHand_gani
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com