- 26 న బ్రిటన్ పార్లమెంట్ హాల్ లో ప్రదానం
- "భారతీయ ఆయుర్వేద శాస్త్రం - వ్యవసాయ సాంకేతికత" - పరిశోధనా గ్రంథాలకు ప్రపంచ రికార్డుల్లో స్థానం
- పలువురు ప్రముఖుల అభినందనలు
విజయవాడ, జూన్ 22, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు (ఏపీఎంఏపీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ) ఆవుల చంద్రశేఖర్ కృషికి అంతర్జాతీయ అవార్డు దక్కింది. "భారతీయ ఆయుర్వేద శాస్త్రం - వ్యవసాయ సాంకేతికత" అనే ప్రధాన శీర్షికతో 50 పరిశోధనా గ్రంథాలను స్వల్ప వ్యవధిలో ఆయన వెలువరించారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న "వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్" సంస్థ చంద్రశేఖర్ కృషిని గుర్తించి, అంతర్జాతీయ అవార్డుకు ఎంపికజేసింది. లండన్ నగరంలోని బ్రిటన్ పార్లమెంట్ హాల్ లో ఈ నెల 26వ తేదీ జరిగే ప్రత్యేకసభలో ఆవుల చంద్రశేఖర్ కు అవార్డును ప్రదానం చేయనున్నారు. "ది ఇండియన్ ఆయుర్వేద సైన్స్ & అగ్రి టెక్నాలజీ" అనే శీర్షికతో, 44 వ్యాధులకు సంబంధించిన 729 ఔషధ మొక్కలు, నివారణలతో కూడిన 50 పుస్తకాలను పూర్తి చేయడం ఒక ముఖ్యమైన రికార్డుగా లండన్ సంస్థ ప్రశంసించింది. ఈ 50 పుస్తకాలన్నీ సహజ నివారణలు, వ్యవసాయ సాంకేతికత, మార్కెటింగ్, వర్గీకరణ, విలువ జోడింపు మొదలైనవాటిని శాస్త్రీయ పద్ధతిలో వివరిస్తాయని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ హోదా కలిగిన చంద్రశేఖర్ ను ఏపీఎంఏపీ సిఈఓగా నియమిస్తూ 2025 మార్చి 28 న రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ ఆయన సేవలను పొడిగిస్తూ 2026 ఏప్రిల్ 6 న కొనసాగింపు జిఓ వెలువడింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత, 28-03-2025 నుండి విదేశీ సేవల నిబంధనలు, షరతులపై ఏపీఎంఏపీబీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు.
"ది ఇండియన్ ఆయుర్వేద సైన్స్ & అగ్రి టెక్నాలజీ" అనే శీర్షికతో ఆవుల చంద్రశేఖర్ రాసిన 50 పుస్తకాలలో మొక్కల వర్గీకరణ, మొక్కను గుర్తించడానికి, దాని స్థానాన్ని తెలుసుకోవడానికి జియో-ట్యాగింగ్, సాగు పద్ధతులు, అంతరపంటలు, మొక్కల రక్షణ, తెగుళ్ల నివారణ, పంటకోత పద్ధతులు, సాగు ఖర్చు, స్థూల, నికర ఆదాయం, ఔషధ ఉపయోగాలు, సంభావ్య దుష్ప్రభావాలు, వ్యాధి సూచనలు, దిగుబడి పరిరక్షణ పద్ధతులు, ధరలు ఇతర వివరాలు, మూలికా పరిశ్రమ వివరాలు, స్వరూపశాస్త్రం వంటి అంశాలపై సవివరమైన వివరణ కూడా ఉందని "వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్" గుర్తించింది. ఔషధ మొక్కలు, వాటి భాగాలు, విలువ జోడించిన ఉత్పత్తుల వివరాలు, మొక్కల పరిశోధన వ్యాసాలు, వ్యాధి - పరిస్థితి అధ్యయనాలు, ముగింపులు వంటివి వున్నాయి. ఈ పుస్తకాలు ఉద్యానవన శాస్త్రం, వ్యవసాయం, వృక్షశాస్త్రం, బయో-టెక్నాలజీ, ఆయుర్వేదం మొదలైన వాటి విద్యార్థులకు, వైద్యులకు, ఫార్మా పరిశ్రమలకు, రైతులకు, అలాగే సాధారణ ప్రజలకు కూడా నివారణ సంరక్షణ కోసం, సాధారణ అనారోగ్యాల చికిత్స కోసం ఉపయోగపడతాయి.
పరిశోధనా గ్రంథాలివే :
ఆవుల చంద్రశేఖర్ వెలువరించిన పరిశోధనా గ్రంథాలలో పలు రకాల ప్రత్యేక వైద్య చికిత్సలకు సంబంధించిన కీలక వివరాలున్నాయి. ముఖ్యంగా కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, హెపటాలజీ, ఫల్మనాలజీ, గైనకాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, ఆంకాలజీ, బేరియాట్రిక్స్, ఓపియాలజీ, ఆర్కనాలజీ, రుమటాలజీ, మలేరియాలజీ, డయేరియా, హెమటాలజీ, ఎక్స్ క్రిటరీ సిస్టమ్, గ్యాస్ట్రో ఇంటెన్షనల్ సిస్టమ్, ఆప్తమాలజీ, ట్రికాలజీ, యూరాలజీ, ఓష్టియోలజీ, అడంటాలజీ, వంటి ప్రత్యేక వైద్య విభాగాల మీద అధ్యయనం సాగించారు. పలు రకాల వ్యాధులకు భారతీయ ఆయుర్వేద శాస్త్రంలోని విధానాలను వివరించారు. సంబంధిత ఔషధ మొక్కలను గుర్తించారు.
నిరంతర కృషితో వందకు పైగా అవార్డుల కైవసం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖలో వివిధ హోదాల్లో, పలు జిల్లాల్లో పనిచేసిన ఆవుల చంద్రశేఖర్ విధి నిర్వహణలో నిరంతర కృషితో వందకు పైగా అవార్డులను కైవసం చేసుకున్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులెన్నో ఆయన కీర్తి కిరీటంలో వచ్చి చేరాయి. పలు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ, జిల్లా పరిపాలన శాఖ నుండి అందుకున్న నగదు బహుమతులు 116 దాకా వున్నాయి.
రాష్ట్ర స్థాయి అవార్డులు :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 1999లో రాష్ట్రస్థాయి వన సంరక్షక అవార్డు అందుకున్నారు. 2008, 2023 సంవత్సరాల్లో "విశిష్ట వన సంరక్షక గోల్డ్ మెడల్ అవార్డు రెండు సార్లు ఆయనకు దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2018లో నిర్వహించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద ఉత్తమ నేల పరిరక్షణ పురస్కారం వరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం డి.ఎఫ్.ఓ. గా అటవీ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంచినందుకు ఏపి గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ గ్రీన్ అవార్డ్స్-2017ను అందుకున్నారు. కరువు, ఎడారీకరణలో పచ్చదనం మెరుగుదల కింద అనంతపురం జిల్లాలో పచ్చదనం పెరుగుదల - 2018 అవార్డును అప్పటి ముఖ్యమంత్రి నూజివేడు సభలో ప్రదానం చేశారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ వన్యప్రాణి సంరక్షణ నిర్వహణ అవార్డును 2026 మార్చి 3 న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలో ప్రదానం చేశారు.
అంతర్జాతీయ అవార్డులు :
1. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికేట్, అంతర్జాతీయ అవార్డు, తేదీ.23-01-2026. "ది ఇండియన్ ఆయుర్వేద సైన్స్ అండ్ అగ్రి టెక్నాలజీ". 15 సెప్టెంబర్, 2025 నుండి 16 డిసెంబర్, 2025 వరకు కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలో 468 ఔషధ మొక్కలతో కూడిన 33 పుస్తకాలను పూర్తి చేసినందుకు అవుల చంద్రశేఖర్‌కు ఈ పురస్కారం లభించింది.
2. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికేట్, అవార్డు, తేదీ.23-01-2026 "ది ఇండియన్ ఆయుర్వేద సైన్స్ అండ్ అగ్రి టెక్నాలజీ". 468 ఔషధ మొక్కలు మరియు 17 వ్యాధులకు సహజ నివారణలుగా వాటి ఉపయోగాలను వివరించే 33 పుస్తకాలకు అవుల చంద్రశేఖర్ పేరు మీద ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ పుస్తకాలు వైద్యపరమైన ఉపయోగాలు, వ్యవసాయ - సాంకేతిక పద్ధతులకు కూడా ఉపయోగపడతాయి.
3. అమెరికన్ మెరిట్ కౌన్సిల్ సర్టిఫికేట్, అవార్డు, తేదీ.21-02-2026. "ది ఇండియన్ ఆయుర్వేద సైన్స్ అండ్ అగ్రి టెక్నాలజీ". 31 మానవ వ్యాధులకు సహజ నివారణలుగా ఉపయోగపడే 533 ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలతో కూడిన 37 పుస్తకాల రంగంలో ఆవుల చంద్రశేఖర్ అవసరాలను విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు పొందారు.
4. అమెరికన్ మెరిట్ కౌన్సిల్ సర్టిఫికేట్, అవార్డు, తేదీ.21-02-2026. "భారతీయ ఆయుర్వేద శాస్త్రం మరియు వ్యవసాయ సాంకేతికత" ఆవుల చంద్రశేఖర్ 37 పుస్తకాల రంగంలో సామాజిక అవసరాలను విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు పొందారు. 533 ఔషధ మొక్కలతో కూడిన ఈ ప్రాజెక్ట్ 2025 సెప్టెంబర్ 15 నుండి 2025 డిసెంబర్ 16 వరకు కేవలం 3 నెలల స్వల్ప వ్యవధిలోనే పూర్తయింది.
5. సిఈఓ చంద్రశేఖర్ కృషికి మెచ్చి ప్రపంచ సంస్థలు ఏపీఎంఏపీకి అంతర్జాతీయ ప్రమాణ ధృవపత్రాలను ప్రదానం చేశాయి. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, పరిశోధన సంస్థ ద్వారా జారీ చేయబడిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, తేదీ.23-02-2026. ఏపీ ఔషధ, సుగంధ మొక్కల బోర్డును క్యూఆర్ఓ స్వతంత్రంగా మదింపు చేసింది. ఇది ఐఎస్ఓ 9001:2015, నాణ్యతా నిర్వహణ వ్యవస్థ యొక్క అవసరాలకు అనుగుణంగా ఉంది.
6. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, పరిశోధన సంస్థ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి 23 న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను జారీ చేశారు. ఏపీ ఔషధ, సుగంధ మొక్కల బోర్డును క్యూఆర్ఓ స్వతంత్రంగా మదింపు చేసింది. ఇది ఐఎస్ఓ 14001 : 2015, పర్యావరణ నిర్వహణ వ్యవస్థ యొక్క అవసరాలకు అనుగుణంగా వుందని గుర్తింపు దక్కింది.
పనిలోనే విశ్రాంతి : ఆవుల చంద్రశేఖర్ సేవా స్ఫూర్తి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనబాకం గ్రామంలో 1965 జనవరి 1న జన్మించారు ఆవుల చంద్రశేఖర్. తల్లిదండ్రులు శ్రీమతి చెంగమ్మ, ఆవుల రామయ్య. తండ్రి అటవీశాఖలో చిరుద్యోగిగా పనిచేస్తూనే, వ్యవసాయంపై మక్కువతో రైతు జీవితాన్ని కూడా గడిపారు. తండ్రి రామయ్య స్ఫూర్తి, తల్లి చెంగమ్మ ప్రోత్సాహంతో ఆవుల చంద్రశేఖర్ బాల్యం నుంచే ప్రకృతిని, పాఠశాలను ఆరాధిస్తూ వచ్చారు. ప్రాథమిక పాఠశాల నుంచే విద్యలో ప్రతిభను చాటుకున్నారు. పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించారు. స్వర్ణముఖి నదీతీరం లోని పనబాకం గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. స్వగ్రామంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. చంద్రగిరి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపిసి చదివారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో బి.ఎస్సీ (బి.జడ్.సి) పూర్తి చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డిప్లమో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ సర్టిఫికెట్ పొందారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్) పట్టా అందుకున్నారు.
తొలి ప్రయత్నం లోనే విజేత - నిరంతర స్పూర్తిదాత :
బాల్యం నుంచే ప్రకృతిని, పొలాలను దగ్గరగా గమనిస్తూ పెరిగిన చంద్రశేఖర్ విద్యలో కూడా ఎంతగానో రాణించారు. ఉద్యోగవేటలో పట్టుదలతో తొలి ప్రయత్నం లోనే విజేతగా నిలిచి, అందరికి స్ఫూర్తిదాతగా ఎదిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖలో సహాయ ఫారెస్ట్ రేంజ్ అధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. మధ్యప్రదేశ్లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత, తొలి పోస్టింగ్ తిరుపతిలోనే దక్కడంతో, ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది. విధి నిర్వహణలో ఆయన నిబద్ధతకు మెచ్చి, ఎందరో ఉన్నతాధికారులు బాగా ప్రోత్సహించారు. చంద్రశేఖర్ విశిష్ట సేవలకు, అంకితభావానికి నిదర్శనంగా అనేక అవార్డులు, రివార్డులు ఆయనను వరించాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆయనకు దక్కాయి. ఉద్యోగ ఉన్నతి పొంది ఫారెస్ట్ రేంజ్ అధికారిగా, డివిజనల్ ఫారెస్ట్ అధికారిగా, జిల్లా అటవీశాఖ అధికారిగా, సహాయ అటవీ సంరక్షణ అధికారిగా వివిధ హోదాల్లో విశేష సేవలందించారు. తిరుపతి, నంద్యాల, నిజామాబాద్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు నెల్లూరు జిల్లాలో తనదైన శైలిలో సేవలందించారు. అటవీ శాఖలోని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంటు వంటి విభాగాల్లో సైతం విశేష సేవలు అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అటవీశాఖ అధికారిగా దీక్షతో పనిచేయడం ఆయనకు ఎంతో కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. ఎక్కడ పని చేసినా అంకితభావంతో కృషి సాగించడం వల్ల అక్కడి ప్రజలు, అధికారులు, ఉద్యోగుల నుంచి ఎంతగానో మంచి ప్రశంసలు కూడా దక్కాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రభుత్వ పెద్దల నుంచి ఎన్నో ప్రశంసాపత్రాలను కూడా అందుకున్నారు.