వెబినార్ లో గజల్ శ్రీనివాస్, చొక్కాపు, దాసరి, పైడిమర్రి, నల్లాని
ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాల సదస్సు
అనంతపురము, నవంబర్ 15 : బాలసాహిత్య పఠనంతో పిల్లల్లో సమగ్ర వికాసం సాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సాంకేతికయుగంలో బాలసాహిత్య విస్తృతికి సామాజిక మాధ్యమాలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. సాహిత్యమనేది మొదట బాలసాహిత్యంతోనే మొదలైందన్నారు. ఉత్తమ బాలసాహిత్యం పిల్లల్లో చదివే ఆసక్తి, ఆలోచన పంచుతుందన్నారు. ఆధునిక తెలుగు బాలసాహిత్యం క్రీ.శ. 19వ శతాబ్ధి ఉత్తరార్థం నుండి మొదలైందన్నారు. బాలసాహిత్యాన్ని మొదటితరం రచయితలు తరవాతి తరానికి అందించారని వివరించారు. “నేటి తెలుగు బాలసాహిత్య విస్తరణ” అనే అంశంపై నల్లాని రాజేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వెబినార్ నిర్వహించారు. అంతర్జాల సదస్సుకు భారత ప్రభుత్వ “రాజ్యమహిళా సమ్మాన్” అవార్డుగ్రహీత, ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. బాలసాహిత్య సదస్సుకు ముఖ్యఅతిథులుగా ప్రఖ్యాత గజల్ గాయకులు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత, బాలసాహిత్య పరిషత్ అధ్యక్షులు చొక్కాపు వెంకటరమణ హాజరై మాట్లాడారు. విశిష్ట అతిథులుగా కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బాలసాహిత్య పరిషత్ ప్రధానకార్యదర్శి దాసరి వెంకటరమణ, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకులు డా. పత్తిపాక మోహన్, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డి.కె. చదువుల బాబు పాల్గొని ప్రసంగించారు.
“నేటి తెలుగు బాలసాహిత్య విస్తరణ” అనే అంశంపై ప్రముఖ బాలసాహితీవేత్త, బాలసాహిత్య పరిషత్ కోశాధికారి పైడిమర్రి రామకృష్ణ కీలకోపన్యాసం చేశారు. కథలనగానే పిల్లలు వచ్చి వాలతారని, సామాజిక స్పృహ పెరగడానికి కథలు దోహదపడతాయని పైడిమర్రి అన్నారు. నిత్యజీవితంలో సాధ్యం కాని అనేక సంఘటనలు జానపదకథల్లో వుంటాయన్నారు. ప్రాంతీయ మాండలికంలో కూడా అనేక కథలు వస్తున్నాయన్నారు. బాలల కోసం కథలు, గేయాలు, గేయకథలు, వైజ్ఞానిక, జానపద నవలలు వెలువడ్డాయన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ, తెలుగు యూనివర్శిటీతో పాటు పలు ఇతర సంస్థలు కూడా అవార్డులిచ్చి బాలసాహిత్యాన్ని ప్రోత్సాహిస్తున్నాయని వివరించారు. ఈ సదస్సుకు గౌరవ అతిథులుగా కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, నారంశెట్టి బాలసాహిత్య పీఠం వ్యవస్థాపకులు నారంశెట్టి ఉమామహేశ్వర రావు, ప్రముఖ బాలసాహితీవేత్త డా. కందేపి రాణీప్రసాద్, ప్రముఖ బాలసాహితీవేత్త, సీనియర్ జర్నలిస్ట్, “మొలక” పత్రిక సంపాదకులు తిరునగరి వేదాంతసూరి హాజరై మాట్లాడారు. తొలుత నల్లాని రాజేశ్వరి అధ్యక్షోపన్యాసం చేశారు. అంతర్జాతీయ బాలలహక్కుల వారోత్సవాలను ప్రతి ఏటా నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకూ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారని చెప్పారు. ఐక్యరాజ్యసమితి రూపొందించిన బాలలహక్కుల అంతర్జాతీయ ఒడంబడికను ఆమోదిస్తూ 1989 నవంబర్ 20న 180 దేశాలు తీర్మానించాయన్నారు. భారత ప్రభుత్వం 1992 డిసెంబర్ 11న ఈ ఒడంబడికను ఆమోదించి సంతకం చేసిందన్నారు. నవంబర్ 14 న జాతీయ బాలల దినోత్సవంగా, 20వ తేదీన అంతర్జాతీయ బాలలహక్కుల పరిరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తారని వివరించారు. ఈ నేపథ్యంలో నల్లాని రాజేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాల వేదిక జూమ్ ద్వారా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వెబినార్లో పాల్గొని బాలల హక్కుల పరిరక్షణకు మద్దతు తెలియజేసిన వారికి నల్లాని ధన్యవాదాలు తెలిపారు. ఈ వెబినార్లో ఆత్మీయ అతిథులుగా ప్రముఖ విద్యావేత్త, రచయిత, ఆంగ్లానువాదకులు, శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. పతికి రమేష్ నారాయణ, ప్రముఖ బాలసాహితీవేత్త చొప్ప వీరభద్రప్ప, ప్రత్యేక అతిథులుగా ప్రముఖ కవి, రచయిత, ఉపాధ్యాయులు, శ్రీశ్రీ కళావేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు సురేంద్ర రొడ్డ, ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సలహాదారు గొర్తి వెంకటస్వామి, అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, “భూమిపుత్ర” దినపత్రిక సంపాదకులు సాకే శ్రీహరిమూర్తి, బిసి రిజర్వేషన్ పరిరక్షణ సమితి (బిసిఆర్పీఎస్) జాతీయ అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది సాకే నరేష్ లు పాల్గొని ప్రసంగించారు. వెబినార్ సమన్వయకర్తగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సహాయ ప్రొఫెసర్ డా. బత్తల అశోక్ కుమార్ వ్యవహరించారు. అంతర్జాల సదస్సుల్లో పాల్గొని జయప్రదం చేసిన అందరికీ కార్యక్రమ నిర్వాహకులు, ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సిఇఓ గుత్తా హరిసర్వోత్తమ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.
17 న బాలల హక్కుల సదస్సు
“బాలలహక్కులు – చట్టాలు – సామాజిక బాధ్యత” అనే అంశంపై ఈ నెల 17వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు అంతర్జాల సదస్సు నిర్వహించనున్నట్లు సి.ఇ.ఓ. గుత్తా హరిసర్వోత్తమ నాయుడు తెలిపారు. ఈ వెబినార్లో జూమ్ లింక్ మీటింగ్ ఐ.డి. : 924 929 6048, పాస్ కోడ్ : 12345678 ద్వారా పాల్గొని బాలలహక్కుల పరిరక్షణకు మద్దతుగా నిలవాలని కోరారు.