
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలి జనసేన వీరమహిళ కొలసాని లక్ష్మీ డిమాండ్
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే చమురు మార్కెటింగ్ సంస్థలు ఉపసంహరించుకోవాలని ప్రకాశంజిల్లా పర్చూరు నియోజకవర్గ జనసేనపార్టీ వీరమహిళ కొలసాని లక్ష్మీ శనివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చమురు మార్కెటింగ్ సంస్థలు రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డచందంగా ఉందన్నారు. అసలే కరోనా విపత్కాలంలో పనులు లేక కుటుంబ పోషణ కష్టతరంగా మారిన సామాన్య ప్రజలపై వంటగ్యాస్ కంపెనీలు కనికరంలేకుండా వినియోగదారులైన సామాన్యులపై భారం మోపడం భావ్యమా?? అని ఆమె ప్రశ్నించారు. ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించాయని తెలిపారు. పర్చూరు నియోజక వర్గంలో ఇదివరకు ఒక్కో సిలిండర్ ధర 639రూపాయలు ఉండగా…పెరిగిన ధరలు మూలంగా 689 రూపాయలు అయ్యిందన్నారు. దీంతో పాటు రవాణా ఖర్చులు అదనంగా వసూలు చేస్తారని ఆమె వాపోయారు. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని గ్యాస్ కంపెనీలు వెల్లడించాయన్నారు. చమురు మార్కెటింగ్ సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో సామాన్య వినియోగదారులపై మరింత భారం పడనుందని కొలసాని లక్ష్మీ ఆవేదన వ్యక్తంచేశారు.. ఈ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకొని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో సామాన్య మహిళలందరూ సంఘటితమై ధరలు తగ్గించే వరకు ఉద్యమించి పోరాటం చేస్తామని కొలసాని లక్ష్మీ హెచ్చరించారు.