కడప, (జనస్వరం) : కడప నగరంలోని రిమ్స్ వైద్యాలయంలో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు విడిచిన ఘటన మాటలకు అందని విషాదం. ఈ మరణాలు కలవరపరుస్తున్నాయని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేకపోవడం, వైద్య ఉపకరణాలు వినియోగించకపోవడం లాంటి కారణాలతోనే తమ పసి బిడ్డలు కన్నుమూశారని కన్నవారు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం ఇస్తున్న సమాధానం పలు సందేహాలకు తావిస్తోంది. ఆందోళన చేస్తున్నవారిని సమాధానపరిచామని ఆర్డీవో చెబుతున్న మాటల ప్రకారం చూస్తే... రిమ్స్ లో జరిగిన ఘటనను సర్దుబాటు చేసే తాపత్రయమే కనిపిస్తోంది. ఒక మానిటర్ తోనే 30మంది పిల్లలకు వైద్య సేవలు చేశారు అని చెబుతున్న తల్లితండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలి. ఇటువంటి తీవ్ర ఘటన జరిగినప్పుడు తక్షణం తనిఖీలు చేసి విచారణ చేయాల్సిన జిల్లా కలెక్టర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఆసుపత్రి అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఈ ఘటనపై వివరాలు కోరిన మీడియాను ఎందుకు ఆసుపత్రిలోకి రానీయడం లేదు? బిడ్డల మరణంతో ఆందోళనలో ఉన్న తల్లితండ్రులను పోలీసులను పిలిపించి మరీ ఎందుకు తరలించారు? ఆరోగ్య సమస్యలతో ఉన్న మరో 30 మంది పిల్లల ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండదు. ఉన్న వైద్య ఉపకరణాలను వినియోగించరు. ప్రభుత్వంలోని పెద్దలకు మానవీయ కోణం లోపించడమే వైద్య రంగంలో ఇలాంటి దుర్ఘటనలకు కారణం అవుతోంది. పాలకపక్షం తప్పులు, దూరదృష్టి లేమి కారణంగా అభంశుభం ఎరుగని పసికందులకు నూరేళ్లు నిండాయి. ఈ పరిస్థితి అత్యంత అమానుషం, శోచనీయం. కనీసం ఆస్పత్రులకు 24 గంటలు విద్యుత్ అందించలేని దుస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరుకోవడం అత్యంత దురదృష్టకరం. మండిపోతున్న ఎండల కారణంగా విద్యుత్ వాడకం పెరగడంతో కోతలు విధిస్తున్నామని పాలకులు చెప్పడం వారి చేతకానితనానికి నిదర్శనం. ఎండలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మండిపోతున్నాయా? పక్కనున్న తెలంగాణ, తమిళనాడులలో లేవా? మరి అక్కడ విద్యుత్ కోతలు ఎందుకు లేవు? ప్రతిపక్ష నాయకులను దూషించడంలో ఉన్న శ్రద్ద కాస్తయినా విద్యుత్ రంగంపైనా.. వైద్య రంగం అభివృద్ధిపైనా పెట్టి ఉన్నట్లయితే రాష్ట్ర ప్రజలకు ఈ బాధలు తప్పేవి. ఇకనైనా ప్రభుత్వంలోని పెద్దలు కళ్ళు తెరిచి ఆస్పత్రులలో జనరేటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. మరొక్క ప్రాణం కూడా పోకుండా తక్షణం చర్యలు చేపట్టాలని జనసేనాని డిమాండ్ చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com