పెచ్చుమీరుతున్న అధికార పార్టీ ఆగడాలు : జనసేన నాయకులు క్రాంతి కుమార్
అనంతపురం జిల్లా మరిమేకల గ్రామంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామంలో పరిహారం చెల్లించకుండానే అధికారులు ఇళ్లను కూల్చివేస్తున్నారు. అక్కడి అధికారులు ఒక ఇంట్లో మనుషులు ఉండగానే ఇంటిని కూల్చేశారు. ఆ ఇంట్లో ఉన్న మనుషులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి మరియు ఒక వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తున్న జనసేన పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిని హౌస్ అరెస్ట్ అనేదానికంటే అధికార పార్టీ నాయకుల నియంతృత్వ పాలన చేస్తున్నారు అని అనచ్చు. అధికార పార్టీ నాయకుల వైఖరేమిటో ప్రజలకు అర్థమవుతోంది. అధికార పార్టీ నాయకులకు నాది ఒకటే ప్రశ్న…. మీరు ప్రజలకు న్యాయం చేయకుండా, ప్రతిపక్షాన్ని ప్రజల్లోకి వెళ్లనీయకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలు ప్రతి ఒక్కటీ గమనిస్తున్నారు. 151 సీట్లు వచ్చినాయి కదా అది మీ పార్టీ గొప్పతనం అని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు అన్ని సీట్లు రావడానికి కారణం అప్పట్లోని అధికార పార్టీ TDP నాయకుల అధికార దుర్వినియోగం వల్ల ప్రజలు అసహనంతో మీ పార్టీకి ఓట్లు వేశారు. మీరు కూడా వారి లాగే అధికారాన్ని దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో మీ పార్టీ పరిస్థితి కూడా అదే అని మర్చిపోకండి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమంటే మీరు అధికార దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకుల్ని ఇలా దౌర్జన్యంగా హౌస్ అరెస్ట్ లు చేయించడం ఒక దుశ్చర్య. దీన్ని మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటినుంచైనా ఇలాంటి చర్యలు మానుకోండి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం, పునరావాసం, భృతి ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే ముంపు గ్రామాల వారిని ఖాళీ చేయించాలి. చిత్రావతి ముంపు బాధితుల పై మానవత్వం చూపించండి అని చెన్నేకొత్తపల్లి జనసేన నాయకులు ఎటికోటి క్రాంతి కుమార్ అన్నారు.