అమరావతి, (జనస్వరం) : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకొనేందుకు కార్మికులు సాగిస్తున్న పోరాటానికి అండగా నిలుస్తూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12వ తేదీన సంఘీభావ దీక్ష చేయనున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేదు. కార్మికులు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు తమ ఆందోళనను నిరవధికంగా కొనసాగిస్తూనే ఉన్నారు. వారికి నైతిక మద్దతు కొనసాగింపులో భాగంగా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నిరాహార దీక్ష జరుగుతుంది. ఉదయం 10 గం.కు దీక్ష ప్రారంభించి సాయంత్రం 5గం. ముగిస్తారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ దీక్షలో కూర్చొంటారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ పి.ఏ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ విభాగాల చైర్మన్లు కూడా పాల్గొంటారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని తొలుత కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల్ని కలిసి లేఖ ఇచ్చింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్న సంగతి విదితమే. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందని, తెలుగువారికి ఈ ప్లాంట్ ఒక సెంటిమెంట్ అని నాడు ఢిల్లీలో వివరించారు. దీని పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని తెలుగువారి తరఫున తన గళాన్ని బలంగా వినిపించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకువెళ్లాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. 300 రోజులకుపైబడి విశాఖ ఉక్కు పరిరక్షణకు పోరాటం సాగిస్తున్నారు. వీరికి అండగా నిలిచేలా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12న ఈ దీక్షను చేపడుతున్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com