• ప్రశ్నించిన జనసేన నేతలపై పోలీస్ యాక్ట్
• జనసేన ప్రధాన కార్యదర్శి యశస్వి సహా పలువురి అరెస్ట్
విజయనగరం, (జనస్వరం) : అందరికీ ఇళ్లు పథకం కింద వైసీపీ ప్రభుత్వం ఎంత మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చిందో తెలియదు గాని.. అడుగడునా ఇష్టారాజ్యంగా కూల్చివేతలు మాత్రం సాగిస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి అడ్డదిడ్డమైన కూల్చివేతలతో కూల్చివేతల సర్కారుగా జగన్ రెడ్డి ప్రభుత్వం ముద్ర వేయించుకుంది. పేదల గూళ్లు కూల్చే వ్యవహారంలో కనీస నిబంధనలు కూడా పాటించడం లేదు. విజయనగరం పట్టణ పరిధిలోని 40వ వార్డులో శుక్రవారం ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అధికారులు ఇళ్ల కూల్చివేతలకు పూనుకున్నారు. స్థానికులు ఎందుకు కూల్చివేస్తున్నారో చెప్పాలని అడుగుతున్నా పట్టించుకోకుండా పోలీసుల సాయంతో అందర్నీ రోడ్ల మీదకు ఈడ్చేసి కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పేదల గూళ్లు ఎందుకు కూలుస్తున్నారంటూ ప్రశ్నించారు. కూల్చివేతలకు అడ్డుతగులుతున్నారన్న నెపంతో యశస్వితో పాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సీఐ యశస్విని దుర్బాషలాడడం సర్వత్ర విమర్శలకు తావిస్తోంది.