• జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారి కౌలు రైతు భరోసా యాత్ర సీబీఐ దత్తపుత్రుడికి జీర్ణం కావడం లేదు
• ధర్మవరంలో జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
ధర్మవరం, (జనస్వరం) : రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘కౌలు రైతు భరోసా యాత్ర’ చేపడితే దానికి వస్తున్న అపూర్వ స్పందన చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి అవాకులుచవాకులు పేలుతున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు చిలకం మధుసూధన్ రెడ్డి మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజలు చేస్తున్న తిరుగుబాటును చూసి ముఖ్యమంత్రి దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారని, అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలన చేతకాక వ్యవస్థలను అస్తవ్యస్థం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ధర్మవరంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిలకం మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ “క్షేత్రస్థాయిలో వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్రామాల్లోకి వెళితే మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజా స్పందనకు భయపడి కొంతమంది నాయకులు గ్రామాల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారు. దీనిని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి జగన్ దత్తపుత్రుడు, చేతకాని వాళ్లు ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మా నాయకుడు ప్రజలకు దత్త పుత్రుడు తప్ప ముఖ్యమంత్రిలా సీబీఐకో, చంచల్ గూడ జైలుకో దత్తపుత్రుడు కాదు.
• పాలన చేతకాకపోతే తప్పుకోండి :
మ్యానిఫెస్టోలు ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేశామని వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారేలా చేశారు. దీనిపై వచ్చిన ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మత్స్యకారుల అభ్యున్నతికి పాటుపడతామని హామీ ఇచ్చి వాళ్ల జీవన భృతిని దెబ్బతీసేలా జీవో 217 ను తీసుకొచ్చారు. కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే రూ. 7 లక్షలు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చలేక, పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. సభకు వస్తున్న రైతులను అడ్డుకుంటున్నారు. విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెంచింది వాస్తవం కాదా? ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన మాట తప్పడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు పాలన చేతకాకపోతే తప్పుకోండి.
• రాజుల్లా గుర్రాలపై తిరుగుతున్నారు :
వైసీపీ నాయకుల అవినీతి పెచ్చుమీరుతోంది. భూ కబ్జాలు, ఇసుక దోపిడి చేసి పది తరాలకు తిన్న తరగనంత కూడబెడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే రాజుల్లా కోటలు కట్టుకొని, గుర్రాలపై తిరుగుతున్నారు. పూటకో కారు మారుస్తూ రోడ్లపై తిరుగుతున్నారు. ఇవన్నీ మీకు తెలియకుండానే జరుగుతున్నాయా? మీకు తెలియకపోతే మాతో రండి మేము చూపిస్తాం. వైసీపీ నాయకులు ఖర్చు పెడుతున్న సొమ్మంతా ఎవరిదీ? ప్రజలది కాదా? పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజలే తిరగబడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. మీ అవినీతి పాలనపై ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు.
• అన్ని వర్గాలను మోసం చేశారు :
మాది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే వైసీపీ నాయకులు ఆ రైతులను నిలువునా ముంచేశారు. సబ్సిడీలు ఎత్తేశారు. ఎరువులు, పురుగుల మందుల ధరలు పెంచేశారు. సబ్సిడీపై ఇచ్చే వ్యవసాయ పరికరాలను నిలిపివేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగులను మోసం చేశారు. యువత, భవన నిర్మాణ కార్మికులు, బీసీ వర్గాలను నిలువునా ముంచారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. రౌడీలు రాజ్యమేలుతున్నారు. వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అవినీతి లేని పాలన కావాలనుకుంటున్నారు. వ్యవస్థలను కాపాడే వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్నారని” అన్నారు.