●వెదురుకుప్పంలో అక్రమ పాస్బుక్ల దందా..పది వేలకు ఎకరా భూమి పట్టా.. బ్యాంకుల్లో రుణాలు
● రైతులు తాసిల్దార్ కార్యాలయం ముట్టడి
●అక్రమ పాస్బుక్ల దందా నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
వెదురుకుప్పం, (జనస్వరం) : వెదురుకుప్పం తాసిల్దార్ కార్యాలయం నందు గురువారం భూకబ్జాలతో మోసపోయిన ఆళ్ల మడుగు, పచ్చికాపలం, తిరుమలయ్య పల్లి పంచాయతీల రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి, నిరసన తెలియజేశారు. రైతులు, తాసిల్దార్ రైతుల మధ్య కొంత వాగ్వాదం చేసుకోవడం జరిగింది. మండలంలో కొంతమంది వైఎస్సార్సీపీ నాయకుల ప్రోద్బలంతో దొంగ పాస్ పుస్తకాలు సృష్టిస్తున్నారని రైతులు వాపోయారు. మండలంలో చాలా మంది రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల్లో సర్వే నంబర్లు, పేరు, విస్తీర్ణంలో తప్పులు దొర్లాయని, వాటిని సరిచేయకపోతే రైతులు, ప్రత్యేకించి పేద రైతులు భూమిపై హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని జనసేనా పార్టీ నాయకులు పొన్నా యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ రికార్డుల్లో అనేక తప్పులున్నాయని అన్నారు. మండలంలో సుమారు కొన్ని వందల ఎకరాల భూమికి ఇలా నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసినట్టు తెలిసింది. అంటే.. నిజంగా ఈ వందల ఎకరాల భూమి లేదు. కానీ కేవలం కాగితాలపై అంటే పట్టాదారుల పాస్ బుక్ లపై మాత్రమే ఈ భూమి కనిపిస్తుంది. అంతేకాదు కేవలం పట్టాదారు పాస్‌బుక్ మాత్రమే కాదు, ఆన్‌లైన్‌లోనూ అప్డేట్ చేసినట్టు సమాచారం. కాగా ఈ నకిలీ పట్టాదారు పాస్ బుక్‌లతో కొందరు బ్యాంకుల్లోనూ లక్షల రుణాలు పొందినట్టు తెలిసింది. ఈ నకిలీ పాస్ బుక్‌లను తాకట్టు పెట్టి ఈ రుణాలు పొందారు. వెదురుకుప్పం మండలంలో ఆళ్ల మడుగు, పచ్చికాపలం, తిరుమలయ్య పల్లి, దేవరగుడి పల్లి పంచాయతీలకు సంబంధించిన రెవెన్యూ లెక్కదాకలలో ఈ అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు ఈ తప్పును అంగీకరించడం లేదని, చిన్న చిన్న పొరపాట్లతో ఇలా నకిలీ పట్టా పుస్తకాలు వచ్చి ఉండొచ్చని, ఇది వరకు ఉన్న అధికారుల సమక్షంలో జరిగాయని కొట్టేసే ప్రయత్నం చేశారు. బాధితులు మాట్లాడుతూ అనేకసార్లు వెదురుకుప్పం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి అధికారులకు విన్నవించుకున్నప్పటికీ వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాకుండా కాలయాపన చేస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే మేము మరొకసారి ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చేసి, ఆత్మహత్యకు పాల్పడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. పది రోజులలో సమస్యలను పరిష్కరిస్తామని తహసీల్దార్ పార్వతీ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ
కార్యక్రమంలో జనసేన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇంఛార్జ్ పోన్నా యుగంధర్, రైతులు, తదితరుల పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com