నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 263వ రోజున 53వ డివిజన్లో వెంకటేశ్వరపురం విజయ పాల డెయిరీ ప్రాంతంలో జరగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తుంటే సమగ్ర దర్యాప్తు జరపాల్సిన రాష్ట్ర హోంమంత్రి నిద్ర పోతున్నారా అని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పైనే నమ్మకం లేక నిఘా ఉంచిన ఈ ప్రభుత్వం, ప్రతిపక్షాలపై ఇంకే స్థాయి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతుందోనన్న అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రజల స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై బాహాటంగా మాట్లాడిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు తన ప్రాణానికే హాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన మాజీమంత్రి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి లకు భద్రత కల్పించాల్సిన బాధ్యతను తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర హోంమంత్రి ఉన్నారంటే ప్రభుత్వంలో వారి పాత్ర సీఎం జగన్ రెడ్డి చేతిలో కీలుబొమ్మలా ఎలా మారిపోయి ఉందో తెలుస్తోందని అన్నారు. ఇప్పటికైనా వారు బుద్ధి తెచ్చుకుని ఎమ్మెల్యేల భద్రత పై దృష్టి పెట్టి వారు చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై అత్యున్నత దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.