కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా పేదవాడి ఇంటి నిర్మాణం ఏ విధంగా చేస్తారని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర ప్రశ్నించారు. మంగళవారం. పేదలకు ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలతో పాటు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో కూడా పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల విషయంలో అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రతి గ్రామంలో పేదలకు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలు గ్రామానికి ఆనుకొని కాకుండా సుదూరంగా ఉన్నటువంటి కొండ పక్కన, చెరువుల పక్కన, నీటి ముంపు ప్రాంతాలలో స్థలాలు కేటాయించారన్నారు. ఈ స్థలాల విషయంలో అభ్యంతరాలు ఉన్నప్పటికీ స్థలాలు ఎవరికైతే ఇచ్చామో వారందరూ కూడా వెంటనే పనులు మొదలు పెట్టాలని అధికారులు, స్థానిక వైసిపి నాయకులు పేదలను బెదిరిస్తున్న పరిస్థితి ఉందన్నారు. మీరు వెంటనే పనులు మొదలు పెట్టకపోతే మీకు ఇచ్చిన స్థలం వేరే వారికి బదలాయించడం జరుగుతుందని బెదిరిస్తున్న పరిస్థితి ఉందన్నారు. వాస్తవంగా వారికిచ్చిన స్థలాలలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా ఆ స్థలాలలో సరైన రోడ్లు వేయలేదన్నారు. సరిహద్దు రాళ్ళు వేసి స్థలాలు కేటాయించారు కానీ ఆ స్థలాలు ఇచ్చినటువంటి ప్రదేశం వద్దకు మేం స్వయంగా వెళ్లి పరిశీలిస్తే కనీసం రోడ్డు మార్గం కూడా అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ సామాగ్రి ఆ ప్రదేశం వద్దకు ఏవిధంగా చేరుతుందని ప్రశ్నించారు. ఈ వర్షాకాల సమయంలో మరింత ఇబ్బంది అంతేకాకుండా ఎక్కడెక్కడో పేదలు ఇంటి అద్దె తక్కువ ఉన్న చోట నివాసాలు ఉంటూ ప్రభుత్వం వారు మాకు ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుందామని కొద్ది మంది ఉత్సాహం చూపించినా ఆ ప్రదేశంలోకి నిర్మాణ సామాగ్రి తరలించ లేని పరిస్థితి ఉందన్నారు. ఒక్కొక్క చోట కనీసం విద్యుత్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఇల్లు కట్టాలంటే నీరు అవసరం, చాలా చోట్ల బోర్లు కూడా వేయించలేదన్నారు. కనీస సదుపాయాలు లేవు. రవాణా సౌకర్యం కూడా లేదన్నారు. ఇలాంటి పరిస్థితులలో పేదవాడికి ఇచ్చినటువంటి స్థలంలో మీరు అర్జెంటుగా ఇల్లు కట్టడం ప్రారంభించకపోతే మీకు సంబంధించిన ఇంటి స్థలం వేరే వారికి బదలాయిస్తామని అధికారులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కలుగజేసుకుని పేదలకు ఇచ్చిన స్థలాల్లో వెంటనే రోడ్డు, విద్యుత్ సౌకర్యంతో పాటు ప్రతి స్థలంలోనూ యుద్ధ ప్రాతిపదికన బోర్లు వేయించిన తర్వాత పేదలకు ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మాణం ప్రారంభించమని లబ్ధిదారులకు చెబితే బాగుంటుంది కానీ ఉన్నఫలంగా వారి ఇల్లు ఎలా నిర్మిస్తారన్నారు. వెనువెంటనే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పనులు ప్రారంభించిన వెంటనే బిల్లులు మంజూరు అయ్యేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూడి చక్రవర్తి, నర్సీపట్నం టౌన్ ప్రధాన కార్యదర్శి కొప్పాక కళ్యాణ్, గూడెపు తాతబాబు పాల్గొన్నారు.