
విజయనగరంలో గతంలో మీరుచేపట్టిన పాదయాత్ర సమయంలో మీరు జిల్లాకి ఇచ్చిన హామీలు మర్చిపోయారా సిఎం గారు? అని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) ప్రశ్నించారు. జిల్లాలో ముఖ్యమంత్రి బుధవారం పర్యటన దృష్ట్యా గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చని నేపథ్యంలో జనసేన నాయకులు బాలు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం స్థానిక ఆర్.టి.సి.కాంప్లెక్స్ వద్ద శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బాలు మీడియాతో మాట్లాడుతూ గతంలో పాదయాత్ర సమయంలోను మరియు ఎన్నికలముందు జిల్లాలో మూతపడిన పరిశ్రమలు తెరిపిస్తానని, వైద్యకళాశాల, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, మీకు ఎంతో ప్రతిష్టాత్మకమైన నవరత్నాల్లో భాగమైన మద్యపాన నిషేధం అని, జిల్లాలో సాగునీరు, త్రాగునీరు పెండింగ్ ప్రాజెక్టులను అభివృద్ధి పనులు మొదలైన హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే హామీలను తుంగలో తొక్కి జిల్లా ప్రజలకు వెన్నుచూపారు. మాటతప్పను, మడమ తిప్పను, అన్న మాటకు అర్థం ఇదేనా? నేను విన్నాను, నేను ఉన్నాను అనేమాటకు అర్ధం ఇదేనా ముఖ్యమంత్రి గారు అని దుయ్యబట్టారు. మంత్రి బొత్స సత్యనారాయణ మరియు డిప్యూటీ సిఎం పాముల పుష్పాశ్రీ వాణి ఈ మధ్య చీపురుపల్లి, కురుపాం నియోజకవర్గాల్లో ఇంటిపత్రాలు, ఇండ్లస్థలాలు ఇచ్చినప్పడు అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేశామని ఢంకామోగించారు. జనసేన పార్టీనుంచి మేము ఒక్కటే మంత్రులకు చెప్పదలిచ్చాం.. వైస్సార్సీపీ కార్యకర్తలకు మంజూరు ఐతే అర్హులైన పేదలకు మంజూరు కానట్టేనని, ఎంతోమంది పేదలు అమ్మఒడి పధకం, ఇండ్లు మరియు ఇండ్లస్థలాలు కేటాయించిన వారికి కక్షసాధింపుగా వారందరికీ తొలగించారని, వారందరికీ మంజూరు ఐనంతవరకు జనసేన పార్టీ పోరాడుతుందని అన్నారు. అనంతరం జనసేన మైనార్టీ నాయకులు హుస్సేన్ ఖాన్ మాట్లాడుతూ గతంలో జిల్లాలో అడుగుపెట్టినప్పుడు ఇచ్చిన హామీలతో పాటు జిల్లా ప్రధానసమస్యలు ఐనటువంటి యువతీయువకులకు ఉపాధి కల్పించకపోవడం,జిల్లా నుంచి వలసలు నివారించలేకపోవడం,జిల్లాకు క్యాన్సర్ హాస్పిటల్ లేకపోవడం, ప్రభుత్వ వైద్యకళాశాల పెట్టకపోవడం, జ్యుట్ పరిశ్రమలు మూతబడటంతో వేలాది కార్మికులు రోడ్డున పడ్డారని, జిల్లాలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇవన్నీ జిల్లా ప్రజలందరూ ఎదుర్కొంటున్న సమస్యలని, మీ పర్యటన జిల్లా ప్రజలకు పరిష్కారం తీరేలా ఉండాలని, తూతూమంత్రంగా సాగితేమాత్రం జిల్లా ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీ వీరమహిళ భారతి, జనసేన నాయకులు లోపింటి కళ్యాణ్, దాసరి యోగేష్, వడిగి భాస్కరరావు, బూర్లీ విజయ్, బూడి వాసు, రాజు, శీర కుమార్, జడ్డు జన, అల్లిబొయిన శివ, రామకృష్ణ, భవాని, పండు, రొయ్యి రాజు తదితరులు పాల్గొన్నారు.