Hanuma Vihari : హనుమ విహారి జీవిత విశేషాలు
" మనం అందరికీ సాయం చేయలేకపోవచ్చు. కానీ, అందరూ కొందరికి సాయం చేయొచ్చు’’ అనే రోనాల్డ్ రీగన్ మాటలను వంద శాతం నమ్ముతూ తన బాటలో ఎందరికో స్ఫూర్తి నింపుతూ ప్రతి ఒక్కరికీ సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి గారు.
హనుమ విహారి గారి స్వస్థలం కాకినాడ. ఆయన తండ్రి సత్యనారాయణ విహారి గారు సింగరేణి ఉద్యోగి కావడంతో ఆయన బాల్యం మణుగూరు, గోదావరిఖనిల్లో గడిచింది. విహారి తల్లి విజయ గారి స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. సత్యనారాయణ గారు హనుమ భక్తుడు కావడంతో కుమారుడికి హనుమ విహారి అని పేరుపెట్టారు. చిన్నతనంలోనే విహారి బ్యాట్ పట్టుకొని గల్లీల్లో క్రికెట్ ఆడేవాడు. అతడి ఆటతీరుకు తల్లిదండ్రులు ముచ్చటపడ్డారు. మణుగూరులో కొంత కాలం ఉన్న హనుమ విహారి అక్కడే రెండో తరగతి పూర్తి చేశారు. చిన్నతనంలో మణుగూరు రోడ్లపై క్రికెట్ ఆడిన రోజులు ఆయనకు ఇప్పటికీ గుర్తే. కొడుకును క్రికెటర్ చేయడం కోసం విజయ గారు భర్తను ఒప్పించి.. కొడుకు, కుమార్తెను తీసుకొని హైదరాబాద్ వెళ్లారు. విహారి తండ్రి మణుగూరులో సింగరేణి ఉద్యోగం చేస్తుంటే.. సికింద్రాబాద్ ప్రాంతంలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్న విజయ గారు పిల్లల బాధ్యత చూసేవారు.
విహారికి 12 ఏళ్ల వయసులో.. రాష్ట్ర స్థాయిలో అండర్-13 క్రికెట్ ఆడుతున్న సమయంలో తండ్రి మరణించారు. దీంతో విజయ గారు కృంగిపోయారు. కానీ కొడుకు కోసం బాధను దిగమింగుకున్నారు. భర్త మరణించడంతో పరిహారంగా సింగరేణి ఇచ్చిన డబ్బుల్లో కొంత వెచ్చించి విహారీ ప్రాక్టీస్ చేయడం కోసం ప్రత్యేకంగా పిచ్ రూపొందించారు. అప్పటి నుంచి విహారీ ఆట ఎంతో మెరుగైంది. హైదరాబాద్ రంజీ జట్టులోకి చేరడం.. ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికవడంతో పాటు.. తర్వాత ఆంధ్రా జట్టుకు సారథిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత హైదరాబాదు టీమ్ కు మారారు. ఆ తర్వాత 2018లో టీమిండియా తలుపు తట్టాడు.
సిడ్ని వేదిక ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్ :
ఓటమి అంచున ఇండియా మూడు గంటల పాటు ఓపికగా క్రీజ్‌లో నిలిచి.. ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. గాయాలు వేధిస్తున్నా.. ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌తో కవ్విస్తున్నా.. ఎక్కడా సంయమనం కోల్పోలేదు. 161 బంతుల్లో 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తెలుగు కుర్రాడు హనుమ విహారిపై యావత్ భారతం ప్రశంసల వర్షం కురిపించింది. ఓ వంద పరుగులు కొట్టి టెస్ట్ మ్యాచ్‌ను కాపాడటం అతనికి చాలా ఈజీ..! కానీ ఓ రెండు రోజుల పాటు హాస్పిటల్ బెడ్ మీద ఉండాలంటే మాత్రం అతను చాలా ఇబ్బందిపడతాడు. అలాంటిది దేశమే కష్టకాలంలో ఉన్న సమయంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి క్రికెట్ అభిమానుల పాలిట ఆపద్బాంధవుడిలా మారాడు. ఓవైపు బ్రిటిష్ గడ్డపై క్రికెట్ ఆడుతూనే.. మరోవైపు స్వదేశంలో కరోనాతో అల్లాడుతున్న అభాగ్యులకు తనవంతు సాయం అందించాడు..! వాళ్లు అడిగిందే తడవుగా.. ఏది అవసరమైతే దానిని అందిస్తూ.. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇబ్బందిని తెలుసుకొని వారికి సంపూర్ణంగా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎంతో మందికి సహాయం అందించాడు. అందిస్తున్నాడు. తీరుస్తున్నాడు..!
టీమిండియాలాగా శక్తి వంచన లేకుండా కష్టపడే ఓ టీమ్‌నే సృష్టించుకుని సేవలందిస్తున్నాడు..!
ఆక్సిజన్ కొరత.. హాస్పిటల్లో బెడ్.. ప్లాస్మా దాత.. ఫలానా మందులు కావాలి.. ఈ ట్రీట్మెంట్ అవసరం... కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు అల్లాడుతున్న భారతదేశంలో ఎక్కువగా వినిపించిన, వినిపిస్తున్న మాటలివి. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వాలు ఎంత చేస్తున్నా.. సరైన సమయంలో సాయం అందక ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోల్పోతున్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎవర్ని సాయం అడగాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ కష్టకాలంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర ప్లేయర్లు గవర్నమెంట్స్‌కు, ఎన్జీవోలకు విరాళాలు అందిస్తే.. తెలుగు క్రికెటర్ హనుమ విహారి మరో దారి ఎంచుకున్నాడు. " హనుమ విహారి ఫౌండేషన్ " అనే వెబ్సైట్ ప్రారంభించి అనాధ పిల్లలకు ఉచిత విద్య, మహిళల సాధికారికత కోసం, వితంతుల సంక్షేమం, రక్తదాతలను అంతర్జాలంలో ఒకచోటికి తీసుకొచ్చి అత్యవసర సమయంలో ఎవరికైనా రక్తం అవసరం అయితే సమకూర్చడం, ఇతర ఎన్నో సేవలు అందిస్తున్నారు.
మొదటి అడుగు :
కరోనా బాధితులను ఆదుకునేందుకు విహారి.. ట్విట్టర్ లో ఓ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ఇందులో తన భార్య, సోదరి, స్నేహితులు, సహచర క్రికెటర్ యర్రా పృథ్వీ రాజ్‌తో పాటు తనను నమ్మిన అనుచరులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన వెయ్యి మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్లందర్ని గ్రూప్‌లుగా విభజించి పేషెంట్లకు అవసరమైన వాటిని అందజేస్తున్నాడు. అప్పుడు కౌంటీ క్రికెట్ కోసం లండన్‌లో ఉన్నాడు. అక్కడి నుంచే నిత్యం వీళ్లతో ట్విట్టర్ లో సంప్రదింపులు జరిపేవాడు. ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్, హాస్పిటల్ బెడ్.. ఇలా ఏది కోరినా తన టీమ్ ద్వారా బాధితులకు సహాయం అందజేసేవారు. గాయంతో బాధపడుతూ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియాను గెలిపించిన దానికంటే.. ఇలా ప్రాణాలు కాపాడటం చాలా గొప్పగా ఉందని. ‘ ఏదో పేరు ప్రతిష్టల కోసం నేను ఇదంతా చేయడం లేదు. ఈ కష్ట కాలంలో నిజంగా సాయం... అవసరమైన ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నా అని తరుచూ అంటుంటారు. ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల హాస్పిటల్లో ఓ బెడ్ దొరకడం కూడా కష్టమవుతుందని నేనైతే కలలో కూడా ఊహించలేదు. ఈ పరిస్థితిని చూసి చాలా బాధపడ్డా. అందుకే నా అనుచరులు అందరిని వాలంటీర్లుగా మార్చుకున్నా. వారితో కలిసి అవసరమైన వారికి సాయం అందజేస్తున్నా. ప్లాస్మా, బెడ్స్, మెడిసిన్స్ సమకూర్చుకోలేని వారికి సాయం చేయాలనేది నా ప్రధాన లక్ష్యం. నిజానికి ఇప్పటిదాకా నేను చేసింది పెద్ద లెక్కలోకి రాదు. భవిష్యత్తులో చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. ఓ మంచి ఉద్దేశంతో ఓ టీమ్‌ను తయారు చేశా. ఇతరులకు సాయం చేయాలనే మంచి ఆలోచనతో ఉన్నవాళ్లంతా అందులో ఉన్నారు. అలా నా వాట్సాప్ గ్రూప్‌లో వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. ఎవరైనా కొద్దిమందికి సరైన సమయంలో సాయం అందించగలిగాను అంటే అది వాళ్ల కృషే. ఓ క్రికెటర్‌గా అందరికీ నేను తెలుసు. కానీ నా టీమ్ మెంబర్స్ చూపిస్తున్న చొరవ వల్లే కష్టంలో ఉన్నవారికి అండగా నిలవగలుగుతున్నాం. నేను ఒక్కడిగా ఈ ప్రయాణం చేశా అన్నారు. నాతో పాటు నేను నమ్మిన సమాజాన్ని ప్రేమించే ఎంతోమంది పౌరులు దేశానికి సేవ చేస్తున్నామని గర్వంగా పొంగిపోతూ నాతో చెప్పే మాటలు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. మాతో పాటు పనిచేసే వాలంటీర్లు అని చెబుతూ ఉంటే ఒక సాధారణ భారతీయ పౌరుడిగా ఇంతకంటే ఏం కావాలి అంటారు.
హనుమ విహారి వలన సహాయం పొందిన ఎన్నో వందల, వేల మంది సామాజిక మాధ్యమాల ద్వారా హనుమ విహారి గొప్ప మనసుకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.
అందరి మనసులు గెలిచిన రారాజుకి, గల్లీ క్రికెట్ నుంచి ఇండియన్ క్రికెట్ టీంకు ఎదిగిన తెలుగు తేజం, దేశంపై తనకున్న ప్రేమను బాధ్యతను సాటి మనిషికి సహాయం అనే రూపంలో పౌరుడిగా ఎలా ఉండాలో మార్గదర్శనం చేస్తున్న వ్యక్తికి, మీలాంటి బాధ్యత కలిగిన పౌరుల సమూహంగా ఏర్పడి స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న జనసైనికుల అందరి తరపున మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
- చంద్రశేఖర్
ట్విట్టర్ ఐడి : @chandrasekarJSP
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com