నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 284వ రోజున 47వ డివిజన్ దూదుల వారి వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నగరంలోని దూదుల వారి వీధి ప్రాంతంలో అనేకమంది చేతి వృత్తిదారులు నివసిస్తున్నారని, అనాది కాలంగా తమ కుటుంబపరంగా, కులపరంగా వస్తున్న వృత్తులను వదలలేక, వేరే పనులు చేయలేక బ్రతుకు బండిని లాగుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుండి వీరికి కనీస ప్రోత్సాహం లేదని అన్నారు. ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కో బాధ చెప్తున్నారని, కోవిడ్ తదనంతర పరిణామాల్లో తాము అప్పులపాలు ఎలా అయిందో వివరిస్తున్నారని అన్నారు. కొన్ని కుల వృత్తులకు, చేతి వృత్తులకు మాత్రమే చేయూత క్రింద ప్రభుత్వం ఏడాదికి 10 వేల రూపాయల నగదు సాయం చేస్తోందని, ఆ సాయాన్ని కూడా అనేకమంది నకిలీ ధ్రువపత్రాలను పొంది తీసుకుంటున్నారని కానీ నిజమైన చేతి వృత్తులపై ఆధారపడిన తమకు మాత్రం అందట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేతంరెడ్డి వినోద్ రెడ్డి వారిని సముదాయిస్తూ ఈ కష్టాలు ఎన్నో రోజులు నిలవవని, వచ్చే ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానున్నారని, ఆ దిశగా అందరి ఆశీస్సులు కావాలని, పవనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.