గుంటూరు, (జనస్వరం) : రాజకీయ నిరుద్యోగులకు పునరావాసకేంద్రంగా రాష్ట్ర సలహాదారుల వ్యవస్థ మారిందని, పరిపాలనలో ఎలాంటి అనుభవంలేని ఎటువంటి అర్హత లేని వారిని సలహాదారులుగా పెట్టుకొని వారికి కోట్లాది రూపాయల ప్రజల ధనాన్ని అప్పనంగా కట్టబెడుతున్నారని, ఆ కోవలోనే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్న పనికిరాని సలహాల వల్లే రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకొని సర్వనాశనం దిశగా పయనిస్తోందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సంభందిత శాఖామంత్రి కానీ అధికారులు కానీ మాట్లాడరని ప్రతీదానికి తగుదునమ్మా అంటూ కేవలం సలహారుడిగా మాత్రమే ఉన్న సజ్జల ముందుకొస్తున్నారని అలాంటప్పుడు క్యాబినెట్ మొత్తాన్ని రద్దు చేసి సకల శాఖామంత్రిగా సజ్జలని నియమిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. బుద్ధిమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ నేతల తీరుతో పరిపాలన గాడితప్పిందని, దీంతో రాష్ట్రంలో సామాన్యులు మొదలుకొని వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు ఇలా ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సమస్యలతో సతమతం అవుతుంటే ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి గడప దాటకుండా పబ్జి ఆటలో తలమునకలై ఉన్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని, విద్యుత్ బకాయిలు 30 కోట్లు కూడా కట్టే స్థితిలో లేని పాలకులు రాష్ట్రాన్ని అంధకారం దిశగా తీసుకువెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సమస్యలను పరిష్కరించకుండా మొదటినుంచి ఉద్యోగులతో బెదిరింపు ధోరణితో వ్యవహించటం వల్లే సమస్య మరింత జఠిలమైందన్నారు. ప్రభుత్వ నియంతృత్వానికి తోడు ఉపాధ్యాయులపై, ఉద్యోగులపై తీవ్రస్థాయిలో వైసీపీ సోషల్ మీడియా వేదికగా అసత్య, విష ప్రచారాలు చేయించి వారిని మానసికక్షోభకు గురిచేసారని, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాంటి ఉద్యోగులపై ఇలాంటి కక్షపూరిత ధోరణితో ముందుకు వెళ్ళటం రాష్ట్రానికి మంచిది కాదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ తన కార్యాలయ అజ్ఞాతవాసాన్ని వీడి బయటికీ వచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల ఉద్యమానికి ఎప్పుడు అవసరం వచ్చినా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని, ప్రభుత్వ అరాచక పాలనపై త్వరలోనే ప్రణాళికాబద్ధమైన పోరాటాలకు జనసేన సమాయత్తం అవుతుందని గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్, నారదాసు ప్రసాద్, నక్కల వంశీ, ఆళ్ళ హరి, యడ్ల మల్లి, శీలం మోహన్, శిఖా బాలు తదితరులు పాల్గొన్నారు.