గుంతకల్ ( జనస్వరం ) : గుత్తి మండలం చెర్లోపల్లి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సుమారు 700 మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు. వీరు సోమవారం రాత్రి తమ గదిలో పడుకున్న తర్వాత 9, 10 తరగతులకు చెందిన 11 మంది విద్యార్థులను ఎలుకలు కొరికి గాయపరిచాయి. ఈ సంఘటన తెలుసుకున్న జనసేన పార్టీ అంతపురం జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ మరియు గుత్తి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎలుకల దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతులు సరిగా లేకపోవడం వల్లనే విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయని, కనీస వసతులైన బాత్రూంలు, డార్మెంటరీలు, పాఠశాల పరిసర ప్రాంతాల్లో శుభ్రత పాటించకపోవడం వలనే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డార్మెంటరీలో అపరిశుభ్రత తాండవం చేస్తుంది ఈ కారణంగా ఎలుకలు తరచూ కరుస్తున్న ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, విద్యార్థులు ఎలుకలు కొరికిన గాట్లను చూపించి బాధపడుతున్నారు. గదుల్లో ఎలుకలు సంచరిస్తుంటే ఆహారం, నీరు కలుషితమై విద్యార్థులు అనారోగ్యానికి గురైతే ఎవరిది బాధ్యత.? కనీసం స్కూల్ కి ఏఎన్ఎం కూడా అందుబాటులో లేదు, గౌరవ ముఖ్యమంత్రిగారేమో నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఎంతో సుందరీకరించాము, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా ఉన్నాయని గొప్పలు చెబుతున్నారు, కానీ ఇక్కడ అలాంటి ఆనవాళ్ళు ఏమీ కనబడడం లేదు, తక్షణం ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఇలాంటివి పురావృతం కాకుండా నివారణ చర్యలు తొందరగా తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. లేని పక్షాన జనసేన పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో గుత్తి జనసేన పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్, వెంకటపతి, దుర్గ, జయరాజ్, చిరంజీవితో అధ్యక్షుడు పాండు కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.