తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. త్వరలో టీఆర్టీ నోటిఫికేషన్ ను విడుదలచేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
దీంతో బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) కు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం త్వరలో పరీక్ష నిర్వహించనుంది. ఇది వరకు నిర్వహించిన టెట్ లో లక్షలాది మంది అర్హత సాధించి టీఆర్టీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది.
స్కూల్ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో మొత్తం 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. స్కూత్ ఎడ్యుకేషన్ లో 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టుల భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లోనే విధివిధానాలను ఖరారు చేసి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. రెండ్రోజుల్లోనే జిల్లా కలెక్టర్లు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు. ఇప్పటికే గురుకులాల్లో 11,714 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా టీఆర్టీ నోటిఫికేషన్ రానుండడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com