నెల్లూరు : ( జనస్వరం ) : నగరంలోని 54 డివిజన్లలో ఉన్న ప్రతి గడపకు జన సైనికులు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు. గురువారం నగరంలోని మాగుంట లేఔట్ లో ఆయన 54 డివిజన్ ల ఇన్చార్జిలు, నెల్లూరు సిటీ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. జనసేనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ ప్రభుత్వంలో సామాన్యుడు బతకలేడన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. నిత్యవసర సరుకులతో పాటు విద్యుత్ , బస్ ఛార్జీలు విపరీతంగా పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, అలాగే తమ పిల్లల భవిష్యత్తుకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా .. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని పూర్తిగా మరిచి ప్రజల ప్రాణాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందని ఎద్దేవా చేశారు. కేవలం 60 రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వం పతనం కాబోతుందని, రాబోయేది జనసేన , టీడీపీ ఉమ్మడి ప్రజా ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ , నెల్లూరు రూరల్ లో ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం చివరి లో జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మన క్రాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఎన్నికలో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా అందరూ కష్టపడి పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో నగరంలోని 54 డివిజన్లో ఇన్చార్జిలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com