హైదరాబాద్, జూలై 25 (జనస్వరం): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఫీవర్ హాస్పిటల్‌లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగేష్ ముదిరాజ్ హాజరై మహిళలు, పిల్లలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం పార్టీ కార్యకర్తల ఆనవాయితీ అని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గానికి అండగా నిలవాలనే సంకల్పంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు పంపిణీ చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నామని అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.