మట్టిని నమ్ముకుని సేద్యం చేస్తూ పరుల కోసం పట్టెడన్నం పండించే పనివాడుగా మారి రేయీ పగలు, తన రెక్కల కష్టంతో దుక్కి దున్ని సాగు చేసి దిక్కులనే నమ్ముకొని పుడమి ఒడిలో పండించిన పంట ఆకలి తీర్చే అమృతంగా మార్చి మనకు అందించే అన్న దాతలు సహాయం అందక నిస్సహాయులుగా సెలవు తీసుకున్నారు. నిరంతరం మట్టితో సావాసం చేసే మట్టి మనుషులు తట్టుకోలేని కష్టంగా భావించి విరామం తీసుకున్నారు. ఈ వైఫల్యం ఎవరిది? ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ రైతుల తల రాతలు మారటం లేదు. ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలు ప్రచారానికే కానీ రైతు విచారం తీర్చట్లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సరైన ధరలు ఇవ్వకపోగా రెండు ఏళ్లుగా సమయానికి ఆ సొమ్మును రైతులకు చెల్లించటం లేదు. పైకం చేతికి రాకుండానే పంట సాగు చేయాలంటే అప్పులు చేయాలి. భారీగా పెరిగిన విత్తనాలు, ఎరువులు, డీజిల్ ధరలు, రైతు కూలీలకు చెల్లించాలని కూలీ పెరిగింది, ఖర్చులు రెట్టింపు అయ్యాయి. కానీ, ఆదాయం రెట్టింపు రావటం లేదు. నష్టాలతో వ్యవసాయం చేయటం కష్టంగా మారిపోయింది. పైగా రైతాంగం పంట కాల్వల మీద ఆధార పడే వ్యవసాయం చేస్తారు. కాల్వలలో నీరు వదిలితే సరి పోతుందనే ధోరణిలో ప్రభుత్వం ఉంది. నిర్వహణ తీరు లేదు. పంట కాల్వలకు మరమ్మత్తులు లేదు, కాల్వలలో నిండిన పూడికను తొలగించట్లేదు. ఈ పరిస్థితి వల్ల వర్షాలకు పంట కాల్వలు నిండిపోతే పైర్లు మునిగిపోతాయి, నాట్లు వేయలేరు, సాగు చేయలేరు కొన్ని ప్రాంతాలకైతే నీరు అందదు. అందిన చోట్లలో సాగుకు నీరు సరి పడినంత ఉందని ధైర్యం చేసి సాగు చేసినా ప్రకృతి వైఫరీత్యాల వల్ల పంట కోసే సమయానికి వర్షాలు వచ్చి వరదలు ముంచెత్తటం. తుఫాన్లు రావటం అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల కొన్నిసార్లు రైతులు నష్టపోక తప్పటం లేదు. వ్యవసాయమంటే పెట్టుబడి అధికం రాబడి స్వల్పం రైతుకు తీరని నష్టంగా మారిపోయింది.
ప్రభుత్వం అందించే ఇన్ పుట్ సబ్సిడీ, పంట నష్టానికి చెల్లించే చెల్లింపులు ప్రకటనలకు, ప్రచారానికే పరిమితం అవుతున్నాయి అన్నదాతకు ఆసరా కల్పించట్లేదు. రైతు దేశానికి వెన్నెముక, రైతే రాజు అంటూ రైతు పేరును పార్టీకి పెట్టుకుని రైతులకు అండగా ఉంటాం అని నమ్మించి ఇప్పుడు ఆ రైతు వెన్ను విరిచేస్తున్నది ఈ ప్రభుత్వం, రైతుల పట్ల బాధ్యత మరిచి లోప భూయిష్ట విధానాలతో, మట్టితో మలినం అంటని మనిషి, మనసులకు రాయితీలు కల్పించుటకు కులం పేరుతో అంట గట్టింది ఈ ప్రభుత్వం. ప్రతి సంవత్సరం 12500/- రైతు భరోసా గా ఇస్తామని వాగ్దానం చేసి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6000/-కలిపి 13500/-ఇస్తుంది. ఇచ్చిన హామీ ప్రకారం 18500 ఇవ్వాల్సిన చోట 5000/-తగ్గించి ఇస్తున్నారు. ఇక్కడా మోసమే ఇలాంటి పరిస్థితుల్లో పచ్చని పైర్లతో కళ కళలాడాల్సిన పొలాలు బీడు వారి ఆదుకునే అండ కోసం ఎదురు చూస్తున్నాయి. భూమాతను నమ్మి నిరంతర శ్రమతో సాగుబడి చేస్తే దళారీ వ్యవస్థతో దగా మోసం. రాబడి లేని సాగు బడి వల్ల బ్రతుకులు భారమవుతుంటే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పాలనా వ్యవస్థ లోపాల వల్ల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఒకప్పుడు వ్యవసాయం వ్యాపారం లాగా లాభాలు ఇచ్చేది. నేడు పెరిగిన వ్యయంతో నష్టం తెచ్చిపెడుతుంది. నష్టం భరించటం కన్నా విరామం ప్రకటించటమే మేలు అనుకొని కొన్ని ప్రాంతాలలో మూకుమ్మడిగా వ్యవసాయనికి విరామం పెట్టారు. ఇది మంచి సంకేతం కాదు ఒక విధంగా ఆహార సంక్షోభానికి దారి తీస్తుంది. దిగుబడి ఎక్కువ అందించే ఖరీఫ్ ఒక పంట వేయకపోతే రైతులకు మాత్రమే నష్టం కాదు సామాన్యులకు భారం. ధాన్యం కొరత ఏర్పడుతుంది ధరలు పెరుగుతాయి, ఏది ఏమైనా పంట విరామం ప్రభుత్వ వైఫల్యమే. రైతు లేనిదే రాజ్యం ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని సాగుబడి చేసి దిగుబడి లేక ప్రాణాలను సైతం పణంగా పెట్టే అన్నదాత కంట కన్నీరు పెట్టని కలల రాజ్యం కావాలి.
ఒక రైతు కన్నీరు తుడవగలిగితే నా జన్మ సార్ధకం అయినట్లే అని ప్రజా పోరాట యాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేడు ఒక్కరు కాదు ఏకంగా 3000 మంది కౌలు రైతుల కుటుంబాల కన్నీరు తుడుస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా అన్నదాతకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఆత్మహత్యలు ఉండవు, వ్యవసాయానికి సాయం కాదు పూర్తి సహకారం అందించాలి.
రైతు బాగుంటే రాష్ట్రమే కాదు దేశమే సుభిక్షంగా ఉంటుంది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com