Logo
Date of Publish : 03 November 2021, 6:39 am
Editor : Sake Naresh

గంజాయి సాగుపై ఉన్న శ్రద్ధ… రాష్ట్ర అభివృద్ధిపై లేదు – జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

    విశాఖపట్నం, (జనస్వరం) : ప్రతి రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందుతుంటే.. వైసీపీ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గంజాయి సాగు అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అది ఎన్ని రెట్లు వృద్ధి చెందింది అనేది పోలీసులే చెప్పాలన్నారు. ముంబై క్రూజ్ షిప్ లో 15 గ్రాముల గంజాయి పక్కన ఉన్న వ్యక్తి దగ్గర దొరికిందని షారూక్ ఖాన్ అబ్బాయిని 23 రోజులు జైల్లో పెట్టారు. అలాంటిది ఒక్కో సీజన్ కు 4 వేల టన్నుల గంజాయి సాగు చేస్తుంటే ఎంత మందిని జైల్లో పెట్టాలని ప్రశ్నించారు. విశాఖపట్నంలో మంగళవారం విజయనగరం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "ప్రస్తుతం ఏఓబీలో గంజాయి భారీగా సాగవుతోంది. దశాబ్దాల నుంచే గంజాయి సాగు ఉంది. ఇప్పుడు అది కొన్ని రెట్లు పెరిగిపోయింది. వైసీపీ నాయకులు మాట్లాడితే మేమే చేశామా.. తెలుగుదేశం హయాంలో కూడా సాగయ్యిందని చెబుతున్నారు. నేను గంజాయి సాగు గురించి మొదట మాట్లాడింది అప్పుడే. నిష్పక్షపాతంగా సమస్యను చూపడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి దానికీ మీరే కారణం అని మాత్రం అనను. నవతర్నాలు హామీ ఇచ్చి వందలో 15 మందికిచ్చి అదే అభివృద్ధి అని చెబితే దానికి కచ్చితంగా వైసీపీనే తప్పుబడతాను" అని అన్నారు.

చెన్నై వైన్ షాపు స్ఫూర్తితో...
"తమ ప్రభుత్వం తీసుకువస్తున్న విధానాలకు మాత్రం వైసీపీయే బాధ్యత తీసుకోవాలి.చెన్నైలో ఒకప్పుడు మమ్మీ డాడీ అనే వైన్ షాపు ఉండేది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వైసీపీ ప్రభుత్వం మమ్మీ డాడీ వైన్స్ ప్రోగ్రాం పెట్టింది. సంపూర్ణ మద్యనిషేదం అంటే మద్యాన్ని పూర్తిగా నిషేధించడం అని అర్ధం. వైసీపీ నాయకుల మాటలకు అర్థాలే వేరు. వైసీపీ నాయకుల పరిభాషలో సంపూర్ణ మద్య నిషేధం అంటే మద్యం మేమే అమ్ముతాము అని చెప్పడం అన్నమాట. ఈ పాలకులు జనాన్ని కూర్చోబెట్టి... తల్లిదండ్రుల మాదిరి ఏం తాగుతారని అడిగి మరీ ప్రోత్సహిస్తున్నారు. మద్యం అమ్మకాల మీద రూ. 23, 400 కోట్ల ఆదాయం వస్తుంది. రోజుకి రూ. 70 కోట్లు. ఖర్చులు పోగా 85 శాతం వారి జేబుల్లోకి చేరుతోంది" అని అన్నారు.

కొండలు.. స్మశానాలే ఇళ్ల స్థలాలా?
"విద్యా విధానం విషయానికి వస్తే ప్రతి విద్యార్ధికీ ముఖ్యమంత్రి మేనమామగా ఉంటానన్నారు. తీరా చూస్తే ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలు మూసేసి అమ్మేయడానికి సిద్ధమయ్యారు. నెల్లూరు వీఆర్ కాలేజీ అమ్మేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు మేనమామ పాత్ర పోషిస్తానన్న ముఖ్యమంత్రి ఎయిడెడ్ కాలేజీలు తీసేసుకుంటున్నాడు. మళ్లీ అధికారంలోకి వస్తే మీ ఇల్లు కూడా తీసేసుకుంటారు. ఆ విషయాన్ని ప్రజలకు చెప్పండి. జగనన్న ఇళ్ల పథకం అన్నారు. కొండలు చూపించారు. స్మశానాలు చూపించారు. బురద గుంటలు, మడ అడవులు చూపించారు. ఇచ్చేది రెండు లక్షలు. పరిస్థితులు ఎంత అస్థవ్యస్థంగా ఉన్నాయో మీ నియోజకవర్గాల్లో మీరు ప్రజల్ని చైతన్యపర్చండి" అని అన్నారు.

ఏ సమస్య వచ్చినా సజ్జల మాత్రమే మాట్లాడతారు
"విజయనగరం జిల్లా గురించి మాట్లాడుకుంటే ముందు అక్కడ ఉన్న పెద్ద మనిషి బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడుకోవాలి. మద్యపాన నిషేధానికి ఆయన తనవంతు కృషి తాను ముందుకు తీసుకువెళ్తున్నారు. గతంలోలా బెల్టు షాపులు కాకుండా ప్రభుత్వం ద్వారానే దాన్ని అమలు చేస్తున్నారు. ఒక బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి, పీసీసీ ప్రెసిడెంట్ గా చేసిన వ్యక్తి ఇప్పుడు వైసీపీలో ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆయన్ని చూస్తే చాలా బాధగా ఉంది.. పురపాలక శాఖ సహాయ మంత్రి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారిపోయింది, ఇప్పుడు హోం మంత్రో, పరిశ్రమల శాఖ మంత్రో, ఆర్ధికశాఖ మంత్రో అవుతారనుకున్నాను. పురపాలక శాఖ పేరు చెప్పి సహాయ మంత్రిని చేశారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లు గుర్తుండవు. ఒక్క రఘురామకృష్ణం రాజు మాత్రమే గుర్తుంటారు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మీడియా ముందుకు వస్తారు. రెవెన్యూ లోటు ఉందన్నా, ఎయిడెడ్ స్కూళ్ల గురించి మాట్లాడాలన్నా, రోడ్ల మీద గుంతలు ఉన్నాయన్నా ప్రతి శాఖకు ఆయనే మాట్లాడుతారు. ప్రతి దానికీ ఆయన ముందుకు వస్తుంటే ప్రజలకు మంత్రుల పేర్లు ఎందుకు గుర్తుకు వస్తాయి. వైసీపీ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో చెప్పడానికి ఇది చాలు. ఇలాంటి పరిస్థితి మారాలని నేను కోరుకుంటున్నా. వైసీపీలో బొత్స ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విజయనగరం జిల్లాలో పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. పోరాట యాత్రలో జోరు వానలో మీరు చూపిన తెగువ మార్పుని సూచిస్తోంది. జిల్లాలో బలమైన మార్పును కోరుకునే ప్రజలు ఉన్నారు. దాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకులే లేరు. అలా అని విజయనగరం జిల్లాకు తెగింపు లేదా అంటే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఓ బలమైన నాయకున్ని జిల్లాలో అడుగుపెట్టనివ్వలేదు. అలాంటి పరిస్థితులు కావాలి. నిలబడే నాయకులు కావాలి. షుగర్ ఫ్యాక్టరీ, నెల్లిమర్ల జూట్ ఫ్యాక్టరీల గురించి బలంగా మాట్లాడే వారు మనకు కావాలి. నేను అద్భుతాలు చేస్తానని చెప్పను. నిలబడతానని మాత్రమే చెబుతా. హెలీకాప్టర్ లో విజయనగరం పోలీస్ గ్రౌండ్ లో దిగినప్పుడు పోలీస్ సమస్యలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రోడ్ల మీద వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. ఏటా 6500 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ప్రతి లక్షకు అత్యంత తక్కువ పోలీసులు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 25 వేల పోలీస్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఏటా 6500 పోస్టులు ఇస్తామని చెప్పి, సెప్టెంబర్ జాబ్ క్యాలెండర్ లో 450 పోస్టులు విడుదల చేశారు. వాటికీ ఈ రోజుకీ దిక్కులేదు. వయసు దాటిపోతే ఏం చేస్తాం. ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఒక నిరంతర ప్రక్రియలా చేపట్టాల్సిన అంశం" అని అన్నారు.

సంపద సృష్టి లేకుండా సంక్షేమం సాధ్యమా?
"అభివృద్ధి, సంక్షేమం పక్కపక్కన ఉండాలి. వైసీపీ మాత్రం సంక్షేమం ఇస్తే సరిపోతుంది అనుకుంటోంది. మరి అభివృద్ధి ఎవరు చేస్తారు. సంపద సృష్టించకుండా సంక్షేమం చేయలేం. సంపద సృష్టించే వారిని విధ్వంసం చేసినా సంపద సృష్టి సాధ్యపడదు. వ్యాపారస్తులు, రాజకీయ కుటుంబాల మధ్యలోనే రాజకీయం నడిస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. మారాలి అంటే మనం సామాజిక మాధ్యామాల్లో పోస్టులు పెడితే సరిపోదు. రోడ్ల మీదకు రావాలి. సమస్యలు తెలుసుకోవడం మన బాధ్యత. గిద్దలూరులో శ్రీ వెంగయ్య నాయకుడు చనిపోతే మా వాళ్లు చూసుకుంటారులే అని నేను అనుకోలేదు. మావాడు చనిపోయాడు అని భావించా. వెళ్లి నిలబడడం నా బాధ్యత అని భావించా. వైసీపీ నాయకులు దాడులు చేస్తే వారికి ఒక్కటే చెబుతున్నా 2024 నుంచి వచ్చే ఐదు సార్వత్రిక ఎన్నికల్లో మాతో పోరాటానికి సిద్ధమైతేనే మీరు మా వాళ్లను బెదిరించండి. కోటల్లోకి తీసుకువెళ్తారో, ఎక్కడకు తీసుకువెళ్తారో మీ ఇష్టం. మేము ఎంత సామరస్యంగా ఉంటామో. మమ్మల్ని మేము రక్షించుకునే వ్యవహారంలో కూడా అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కును వినియోగించుకుంటాం. మీరు వెయ్యి మంది వస్తే మేము లక్ష మంది వస్తాం. జనసేన పార్టీని తిట్టే వారు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. మీరు మాతో 25 సంవత్సరాలు పోరాటానికి సిద్ధం కావాలి. మేము యుద్ధానికి సిద్ధం అయ్యాం. జాగ్రత్తగా మాట్లాడండి. ఉత్తరాంధ్ర కమిటీల విషయానికి వస్తే ప్రతి నియోజకవర్గ క్రియాశీలక కార్తకర్తలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అందర్నీ కలుపుకుపోయే వారు, బాధ్యత తీసుకునే వారిని గుర్తించి కమిటీల్లో చోటు ఇస్తాను" అన్నారు.

ఉత్తరాంధ్రను సొంత జిల్లాగా చూసుకుంటానన్న సీఎం ఎక్కడ..? : నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ "ఉత్తరాంధ్రను సొంత జిల్లాగా చూసుకుంటానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపారా? యువతకు ఉద్యోగాలు ఇచ్చారా? రోడ్లు బాగు చేశారా? కాలేజీలు కట్టారా? గిరిజనుల కోసం ఏమైనా చేశారా? విభజన హామీగా ఇచ్చిన ట్రైబల్ యూనివర్సిటీ ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియదు. మరి ఉత్తరాంధ్రకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఏంటి? జనసేన కార్యకర్తలుగా వీటన్నింటినీ ప్రజల ముందు తీసుకువెళ్లాలి. కేవలం సోషల్ మీడియాకి పరిమితం అయితే సరిపోదు. ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం మన దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. జనసేన శ్రేణులు ఎక్కడా వెనకడుగు వేయొద్దు. ప్రతి గ్రామంలో మన జెండా ఎగరాలి. ఉమ్మడిగా కృషి చేస్తేనే పార్టీ బలపడుతుంది" అన్నారు.

మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం
ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త సింకా ప్రశాంత్ కుటుంబానికి రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పాలవలస యశస్వి, పీఏసీ సభ్యులు కోన తాతారావు, పార్టీ నాయకులు గిరడా అప్పలస్వామి, వంపూరు గంగులయ్య, గడసాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com